Share News

Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:26 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..
CM Chandrababu

విజయవాడ: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రజలకు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. భారత్ అగ్రస్థానంలో ఉంటే వారందరినీ లీడ్ చేసే శక్తి తెలుగు ప్రజలకు ఇవ్వాలని ఉగాది సందర్భంగా దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. విజయవాడ(Vijayawada) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన "ఉగాది పురస్కారాలు" ప్రదానోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "ఆంధ్రప్రదేశ్ ప్రజలే ముందు అనే నినాదంతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తున్నాం. గత ఐదేళ్లపాటు రాష్ట్రంలో కళ తప్పింది. గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలను నేనెప్పుడూ చూడలేదు. అన్నీ చిక్కుముడులే. ఒకదాని తర్వాత మరొకటి వదిలించుకుంటున్నాం. పోటీ ప్రపంచంలో హార్డ్‌ వర్క్‌ కాదు.. స్మార్ట్ వర్క్‌ అవసరం. ఒకప్పుడు ఐటీని, సెల్‌ఫోన్లను ప్రోత్సహించా. సెల్‌ఫోన్ తిండి పెడుతుందా? అని ఒకప్పుడు మాట్లాడారు.


ఇప్పుడు దాని ద్వారానే వాట్సాప్‌ గవర్నెన్స్‌ తీసుకొచ్చాం. ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా సెల్‌ఫోన్లో అడిగితే వాట్సాప్ గవర్నెన్స్‌ ద్వారా అందిస్తున్నాం. పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించాం. హైటెక్ సిటీలో ఐటీకే కాదు.. కళలకూ ప్రాధాన్యం ఇచ్చాం. అందుకే కళలకు ప్రాధాన్యం ఇవ్వడానికే శిల్పకళా వేదిక నిర్మించాం. మరో 25 ఏళ్లలో అమెరికాలో ఉండే తెలుగువాళ్ల కంటే రెండింతలు ఎక్కువగా తెలుగు గడ్డపై ఉన్నవారే సంపాదించగలుగుతారు. యుగాలు, శతాబ్దాలు కాదు.. కేవలం 25 ఏళ్లలోనే ఈ మార్పు కనిపిస్తుంది.


నేను ఏదైనా మంచి చెబితే ఎవరూ అర్థం చేసుకోరు. 20 ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి చెప్పా. అవకాశాలు అందిపుచ్చుకుంటే సాధారణ వ్యక్తులు ఉన్నతంగా ఎదుగుతారు. అధికంగా డబ్బులు సంపాదించే తెలివి ఉన్నవాళ్లు భారతీయులు. నేషనల్ హైవేలను ప్రైవేట్‌ వ్యక్తులు నిర్వహిస్తున్నందున బాగున్నాయి. సమాజంలో కొందరు ఉన్నతంగా ఎదిగారు. ఉన్నతంగా ఎదిగిన వారు తిరిగి సమాజానికి ఇవ్వాలి. రాష్ట్రంలో జీరో పావర్టీ కోసం కృషి చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు ఉన్నా రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టామని" చెప్పారు.


అవార్డులు ప్రదానం..

కాగా, ప్రసంగం అనంతరం సమాజంలో విశిష్ట సేవలు అందించిన 202 మందికి సీఎం చంద్రబాబు ఉగాది పురస్కారాలు అందజేశారు. వీరిలో 86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది అవార్డులు ఇచ్చారు. జర్నలిజంలో తొమ్మిది మందికి కళారత్న అవార్డులు దక్కాయి. ఆంధ్రజ్యోతి న్యూస్ ఎడిటర్ కె.నాగ సుధాకర్‌కు కళారత్న అవార్డును సీఎం చంద్రబాబు ప్రదానం చేశారు. అలాగే స్వాతి ఎడిటర్ వేమూరి బలరామ్, కొల్లు అంకబాబు, భోగాది వెంకట్రాయుడు, ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, మల్లేశ్వర్‌కు కళారత్న అవార్డులు దక్కాయి. తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరామ్, సీహెచ్ మస్తానయ్యకు సేవా రంగంలో అవార్డులు ప్రదానం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Indonesia Earthquake: మరో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..

Ugadi 2025: సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా.. పురాణాలు ఏం చెబుతున్నాయంటే..

Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..

Updated Date - Mar 30 , 2025 | 12:40 PM