AP Assembly: ఏపీ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.. ముఖ్యాంశాలివే
ABN , Publish Date - Feb 24 , 2025 | 10:48 AM
AP Assembly: సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు.

అమరావతి, ఫిబ్రవరి 24: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Session) సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazeer) ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని.. ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని అన్నారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని.. అన్నక్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని అన్నారు.
వాటిపైనే ప్రత్యేక దృష్టి..
కూటమి ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు. అవకాశాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతున్నామని అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని స్పష్టంచేశారు. ప్రతినెల 1నే ఇంటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. పెన్షన్లు రూ. 4 వేలకు పెంచామని.. పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు, విద్య, వైద్యం అందజేస్తున్నామన్నారు. మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు.
శాసనసభ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు..
ఆ దిశగా ప్రభుత్వం అడుగులు
స్థానికసంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఏడాదికి 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించామని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని తెలిపారు. అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేది తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. ప్రతి కుటుంబానికి రక్షిత తాగునీరు, విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేశాం..
ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామన్నారు. మన బడి- మన భవిష్యత్తు ద్వారా స్కూల్స్‌లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని.. P-4 విధానం ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మెరిట్ ఆధారంగా 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించామన్నారు. స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తివేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించామన్నారు. ఐటీఐలు, పాలిటెక్నిక్‌ల్లో 200 స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.
రాయసీమలో ఇక కరువు ఉండదు...
2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సభలో తెలియజేశారు. పోలవరం- బనకచర్ల పూర్తయితే రాయలసీమలో కరువు ఉండదన్నారు. రాష్ట్రంలో సూర్య ఘర్ యోజన కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశామని, తమ ప్రభుత్వ చర్యలతో టూరిజంలో పెట్టుబడులు పెరిగాయన్నారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు అండగా ఉన్నామని.. అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థిక పతనం అంచుకు చేరిందని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి జరిగిన నష్టంపై 7 శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలిపామన్నారు. వైసీపీ పాలనలో వనరుల మళ్లింపు, భారీగా సహజవనరుల దోపిడీ జరిగిందని గవర్నర్ అబ్దుల్ సభలో వెల్లడించారు.
త్వరలోనే వెలిగొండ పూర్తి...
తల్లికి వందనం పథకాన్ని తీసుకువస్తున్నామని.. తొలిసారిగా స్కిల్ సెన్సెన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి ఓ వ్యాపారవేత్త ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. దేశంలోనే ఐటీలో ఏపీని టాప్‌లో నిలిపేలా కొత్త ఐటీ పాలసీ తీసుకొచ్చామని.. ఉద్యోగాలు, నైపుణ్య హబ్‌గా ఏపీని మార్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం నిలిపిన 93 కేంద్ర పథకాల్లో 74 పునరుద్ధరించామని చెప్పారు. నీటిపారుదల, రోడ్ల సంబంధిత రూ.10,125 కోట్ల బిల్లులు క్లియర్ చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వెలిగొండను త్వరలోనే పూర్తి చేస్తామని సభలో చెప్పారు గవర్నర్. 48 గంటల్లోనే ధాన్యం కొనుగోళ్లకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. 10 పోర్టులను అంతర్జాతీయ పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
2029 నాటికి విశాఖలో మెట్రో..
2029 నాటికి విశాఖలో 46 కి.మీ మెట్రో నిర్మాణం జరుగుతుందని, విజయవాడలో 38.40 కి.మీ మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఎనర్జీ రంగంలో 7.5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు. 3 నెలల్లోనే 17,605 కిలో మీటర్ల రోడ్లకు మరమ్మతులు చేపట్టామన్నారు. 2025-26లో విద్యుత్ ఛార్జీల పెరుగుదల ఉండదని తెలిపారు.20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేశామన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించేలా వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్ ఏర్పాటు చేసినట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Somireddy: ఆ భయంతోనే అసెంబ్లీకి జగన్
Read Latest AP News And Telugu News