Lack of Coordination : ఎవరికి వారే!
ABN , Publish Date - Jan 10 , 2025 | 03:21 AM
టీటీడీ... ఒక పెద్ద వ్యవస్థ! వేలాది మంది భక్తులు ఏడుకొండల వాడిపై పెట్టుకున్న విశ్వాసాన్ని కాపాడటం టీటీడీ బాధ్యత! ఇందులో టీటీడీ ఈవో, చైర్మన్, కొండమీద ఉండే అదనపు ఈవోలదే కీలక పాత్ర.

చైర్మన్, ఈవో, అదనపు ఈవో మధ్య సమన్వయ లోపం
వైకుంఠ ఏకాదశిపై 15 సమావేశాలు
ఈవో, చైర్మన్ కలిసి పాల్గొన్నది ఒక్క భేటీలోనే
చైర్మన్ X ఈవో: వాగ్యుద్ధం..
చైర్మన్: చైర్మన్‌గా వచ్చినప్పటి నుంచీ నన్ను చిన్నచూపు చూస్తున్నారు. నాకేమీ చెప్పడం లేదు.
ఈఓ: నీకేం చెప్పడం లేదు? చెబుతూనే ఉన్నాం కదా! (తీవ్ర స్వరంతో)
చైర్మన్: ఏం చెప్పావ్? రేపు వైకుంఠ ఏకాదశి. ఈ రోజు నుంచే హడావుడి ఉంది. మీరు ఏం చేస్తున్నారో ఆ విషయాలు ఏమైనా చెప్పావా? నేను చైర్మన్‌గా ఉండి ఇక్కడ ఏం చేస్తున్నట్లు? (తీవ్ర ఆగ్రహంతో)
ఈవో: నువ్వు మాకు అన్నీ చెప్పే చేస్తున్నావా? మాకు చెప్పే ప్రకటిస్తున్నారా? శ్రీవాణి ట్రస్టు విషయంలో నువ్వేం చేశావు? నాతో మాట్లాడకుండానే ప్రెస్‌మీట్ పెట్టి నీకు నచ్చింది చెప్పేశావు. దాని వల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుందో నీకేమైనా తెలుసా?
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
టీటీడీ... ఒక పెద్ద వ్యవస్థ! వేలాది మంది భక్తులు ఏడుకొండల వాడిపై పెట్టుకున్న విశ్వాసాన్ని కాపాడటం టీటీడీ బాధ్యత! ఇందులో టీటీడీ ఈవో, చైర్మన్, కొండమీద ఉండే అదనపు ఈవోలదే కీలక పాత్ర. అయితే... ఈ ముగ్గురి మధ్య సమన్వయం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాజా ఘటనలతో అది నిజమే అని కూడా స్పష్టమవుతోంది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ రికార్డు స్థాయిలో 15 సమావేశాలు ఏర్పాటు చేయగా... అందులో ఈవో, చైర్మన్ కలిసి పాల్గొన్నది ఒకే ఒక్క భేటీలో అని తెలిసింది.
ఈవో శ్యామలరావు, చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎవరికి వారు ‘సొంత నిర్ణయాత్మక శక్తి’గా ఎదగాలనుకునే క్రమంలో సమన్వయం కొరవడుతోందని, ఇతర పాలనాపరమైన సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం అందినట్లు తెలిసింది. ఇటీవల నాయుడు అమరావతికి వచ్చి ముఖ్యమంత్రిని కలిసి ఈవోపై ఫిర్యాదుల పరంపర కొనసాగించారు. ఈ సమస్యకు తెరదించాలనే ఉద్దేశంతో... చంద్రబాబు శ్యామలరావును పిలిపించి, నచ్చచెప్పారు. సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. అంతటితో ఇద్దరి మధ్య వివాదం ముగిసిందనుకున్నారు. కానీ... గురువారం సీఎం సమక్షంలోనే వారిద్దరూ తీవ్రస్థాయిలో మాటల ఘర్షణకు దిగడం కలకలం రేపింది. దీంతో టీటీడీ వ్యవహారాలను సమగ్రంగా పరిశీలించాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది.