బీసీల పథకాలన్నీ పునఃప్రారంభిస్తాం: సవిత
ABN , Publish Date - Jan 12 , 2025 | 04:24 AM
బీసీలు రాజకీయంగా, విద్యాపరంగా మరింత అభివృద్ధి సాధించాలని, ఇందుకు కూటమి ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత చెప్పారు.
గుంటూరు(విద్య), జనవరి 11(ఆంధ్రజ్యోతి): బీసీలు రాజకీయంగా, విద్యాపరంగా మరింత అభివృద్ధి సాధించాలని, ఇందుకు కూటమి ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత చెప్పారు. గతంలో అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలు పునఃప్రారంభించడంతోపాటు వారి సమగ్ర వికాసానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఉద్ఘాటించారు. స్వాతంత్య్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంత్యుత్సవాన్ని గుంటూరులో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సవిత మాట్లాడారు. కూటమి ప్రభుత్వం బీసీల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.39వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రతి జిల్లాలో డీఎస్సీ కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు, రాష్ట్రస్థాయిలో విజయవాడలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యేలా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. వడ్డెరలను ఎస్సీల్లో చేర్చే ప్రతిపాదనలు మరోసారి పునఃపరిశీలిస్తామన్నారు. వడ్డెరలకు మైనింగ్‌లో ప్రత్యేక కోటా కేటాయించడంతో వారు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అభివృద్ధి సాధించడానికి చేయూత ఇస్తామని తెలిపారు. గుంటూరు నగరంతోపాటు, రాజధాని ప్రాంతంలో వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, పశ్చిమ ఎమ్మెల్యే గళ్లామాధవి, తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ అహ్మద్ తదితరులు ప్రసంగించారు.