AP News: స్టీల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంపై సూళ్లూరుపేట ఎమ్మెల్యే ఏమన్నారంటే..
ABN , Publish Date - Jan 02 , 2025 | 11:21 AM
Andhrapradesh: ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో అగ్నిప్రమాద ఘటనపై సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ స్పందించారు. ఈరోజు ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. నియోజవర్గంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
ఉమ్మడి నెల్లూరు, జనవరి 2: జిల్లాలోని పెళ్లకూరు మండలం పున్నేపల్లి ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ (MLA Vijayasri) గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చెన్నైకు తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధకరమన్నారు. ప్రమాద బాధితులను ప్రభుత్వం తరపున ఆదుకునేలా చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు. నియోజవర్గంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే విజయశ్రీ వెల్లడించారు. కాగా... పున్నేపల్లి ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో గత రాత్రి భారీగా అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించగా.. ఆ సమయంలో అక్కడే ఉన్న ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని నాయుడుపేట, నెల్లూరు ఆస్పత్రులకు తరలించారు.
ఒక్కసారిగా బాయిలర్ పేలడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటేనే బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదంపై యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలోని ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. స్టీల్‌ప్లాంట్‌లో రాత్రి షిఫ్టులో 50 నుంచి 70 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. వీరంతా బీహార్ వాసులేనని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లిన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే నాయుడుపేట డీఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కార్మికుల వివరాలు చెప్పడంలో యాజమాన్యం గోప్యత పాటించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణనష్టం జరగలేదని యాజమాన్యం బుకాయిస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. అసలు ప్రమాదానికి గల కారణాలు.. ఎంత మంది కార్మికులు గాయపడ్డారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
AP News: ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు..
CM Chandrababu: మోయలేనన్ని పాపాలు!
Read Latest AP News And Telugu News