Crime News: విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు గిరిజనుల మృతి
ABN , Publish Date - Jan 22 , 2025 | 07:23 AM
తడకలూరుకు చెందిన మనోహర్, మహలక్ష్మమ్మ గేదెలకు పచ్చిగడ్డి కోసం ఆటోలో తలమంచి మేజర్ కాలువపై వెళ్తుండగా.. వారి ఆటో ప్రమాదానికి లోనైంది. ఆటో బోల్తా పడుతున్న సమయంలో ఇద్దరూ ఆటో నుంచి బయటకు దూకేయడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే..

నెల్లూరు: సహాయం చేసేందుకు వెళ్లిన ఇద్దరు గిరిజనులు (Tribals) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి (Electric Shock) గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన నెల్లూరు జిల్లా (Nellore Dist.), దగదర్తి మండలం తడకలూరులో జరిగింది. దీంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. మృతులు తడకలూరు గిరిజన కాలనీకి చెందిన మనికలా నరసయ్య (24) పొట్లూరి పోలయ్య (45)గా గుర్తించారు. ప్రమాదవశాత్తు ఆటో పొలాల్లో తిరగబడగా ఆటోను వెలికి తీసే సమయంలో పొలాల్లో నీటి మోటర్లకు వినియోగించే విద్యుత్ తీగలు తెగిపడటంతో ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని.. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్థానికుల కథనం ప్రకారం..
తడకలూరుకు చెందిన మనోహర్, మహలక్ష్మమ్మ గేదెలకు పచ్చిగడ్డి కోసం ఆటోలో తలమంచి మేజర్ కాలువపై వెళ్తుండగా.. వారి ఆటో ప్రమాదానికి లోనైంది. ఆటో బోల్తా పడుతున్న సమయంలో ఇద్దరూ ఆటో నుంచి బయటకు దూకేయడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే పొలాల్లో బోల్తా పడిన ఆటోను పైకి తీసుకొచ్చేందుకు స్థానిక గిరిజనుల సాయాన్ని వారు కోరారు. వారికి సాయం చేసేందుకు ఇద్దరు గిరిజనులు నరసయ్య, పోలయ్య వచ్చారు. ఆటోను పైకి లేపుతున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబాలు సంఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించాయి. పోలయ్యకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. నరసయ్యకు ఇంకా వివాహం కాలేదు. దగదర్తి ఎస్ఐ జంపాని కుమార్, ట్రాన్స్‌కో ఏఈ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బొత్సకు ఆ విషయం కూడా తెలియదా..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News