Visakhapatnam : విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీస్
ABN , Publish Date - Mar 23 , 2025 | 06:28 AM
మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు, నేతలు శనివారం జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్‌కు నోటీస్ అందజేశారు.

జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌కు అందజేసిన కార్పొరేటర్లు, నేతలు
విశాఖపట్నం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు, నేతలు శనివారం జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్‌కు నోటీస్ అందజేశారు. తక్షణం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ 70 మంది కార్పొరేటర్ల సంతకాలతో కూడిన నోటీస్ ఇచ్చారు. పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేసిన కార్పొరేటర్ల వివరాలను జీవీఎంసీ అధికారులు నిర్ధారించుకున్న తర్వాత బల నిరూపణకు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు నోటీసులు జారీ చేస్తారు. నోటీసు జారీ చేసిన 15 రోజుల తర్వాత ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానంపై చర్చకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కూటమికి 70 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఉంది. దీంతో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గడం లాంఛనమే.
జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు అందించేందుకు జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేశ్ బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, రాష్ట్ర అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద, జీవీఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, పలువురు కార్పొరేటర్లు వచ్చారు.