Share News

Rush : సంక్రాంతికి సొంతూళ్లకు

ABN , Publish Date - Jan 12 , 2025 | 05:27 AM

సంక్రాంతి పండుగను సొంతూరిలో జరుపుకునేందుకు హైదరాబాద్‌ నుంచి రికార్డు స్థాయిలో ప్రయాణికులు తరలివస్తున్నారు.

Rush : సంక్రాంతికి సొంతూళ్లకు

  • రాష్ట్రానికి తరలిన జనం

  • హైదరాబాద్‌ నుంచి ఒకేరోజు 4 లక్షల మంది రాక

  • టోల్‌ప్లాజాల వద్ద కార్ల బారులు

  • హైవేలపై గంటల తరబడి నిరీక్షణ

విజయవాడ, బస్‌స్టేషన్‌, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగను సొంతూరిలో జరుపుకునేందుకు హైదరాబాద్‌ నుంచి రికార్డు స్థాయిలో ప్రయాణికులు తరలివస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. రవాణా అధికారుల అంచనా ప్రకారం శనివారం ఒక్కరోజే 4లక్షల మంది హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరారు. గతేడాది ఇదేరోజున 3లక్షల మంది రాగా, ఈసారి వీరి సంఖ్య లక్ష పెరిగింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా దాదాపు 2లక్షల మంది వచ్చారని అంచనా. మరో 2లక్షల మంది తమ సొంత వాహనాలు, క్యాబ్‌ల్లో వస్తున్నారు. విపరీతమైన రద్దీ నేపథ్యంలో చిల్లకల్లు, కీసర టోల్‌ప్లాజాల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. శనివారం ఉదయం 8నుంచి సాయంత్రం 4 గంటల వరకు 16వేల వాహనాలు వచ్చాయి. అర్ధరాత్రికి ఈ సంఖ్య 20 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ప్రయాణికులతో విజయవాడ బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్‌ కిటకిటలాడుతున్నాయి. షెడ్యూల్‌ రైళ్లతో పాటు అదనంగా 58 సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నడిపినా కూడా సరిపోని పరిస్థితి నెలకొంది. ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నానికి ఆర్టీసీ అధికారులు 200కు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి ఎన్ని బస్సులు పెట్టినా చాలకపోవడంతో విజయవాడలో తిరిగే సిటీ బస్సులు, అద్దె బస్సులు కూడా పంపిస్తున్నారు.

Updated Date - Jan 12 , 2025 | 05:28 AM