Palla Srinivasa Rao: జగన్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించిన ఏపీ టీడీపీ చీఫ్
ABN , Publish Date - Feb 18 , 2025 | 02:50 PM
Palla Srinivasa Rao: పలు కేసుల నమోదు కారణంగా విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆయనతో ఎందుకు ములాఖత్ అయ్యారో సమాధానం చెప్పాలంటూ వైఎస్ జగన్‌ను టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

అమరావతి, ఫిబ్రవరి 18: గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడితోపాటు ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటి కేసులో అరెస్టయి విజయవాడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. అందులోభాగంగా వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పలు ప్రశ్నలు సంధిస్తూ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినందుకు వంశీకి మద్దతు ఇస్తున్నారా? జగన్ మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు.
జైలులో ఉన్న దళిత వ్యతిరేకి, మహిళా ద్రోహి వంశీని పరామర్శించేందుకు వచ్చారా..? అంటూ వైఎస్ జగన్‌ను ఆయన సూటిగా లేఖ ద్వారా నిలదీశారు. దోపిడిదారుడు వంశీని ఎందుకు ములాఖత్ అయ్యారో సమాధానం చెప్పాలంటూ జగన్‌ను పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆ క్రమంలో ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ జగన్‌కు ఆయన సూచించారు.
1. దళిత ఉద్యోగి సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి హింసించి హత్య చేస్తానని బెదిరించి ఎస్సీ, ఎస్టీ, ఎట్రాసిటీని ధిక్కరించిన వంశీని ఏ మొహం పెట్టుకుని పరామర్శిస్తావ్ జగన్ రెడ్డి.. నీకు దళితుల కన్నా నేరస్థుడు ఎక్కువై పోయాడా..? అని అడిగారు.
2. ప్రజాస్వౌమ్య దేవాలయం అసెంబ్లీలోనే దుశ్యాసునిలాగా మహిళల వ్యక్తిత్వాన్ని కించ పరిచిన నేరస్థుడిని ఏ రకంగా పరామర్శిస్తావ్ జగన్ రెడ్డి..? మహిళల వ్యక్తిత్వం కన్నా నేరస్థుడు వంశీ ఎక్కువైపోయాడా..?
3. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిలువున తగలబెట్టించి గన్నవరం మహిళ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి.. వారాల తరబడి హింసించిన వంశీని ఎలా పరామర్శిస్తావ్ జగన్ రెడ్డి..?
4.తల్లి, చెల్లిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టించిన నీకు.. ఇతర మహిళలపైన గౌరవం ఉంటుందా..?
5. సంకల్పసిద్ధి చిట్స్‌ఫండ్స్ 16 వేల మంది కుటుంబాలను రోడ్డున పడేసిన వంశీని ఎలా పరామర్శిస్తావ్ జగన్ రెడ్డి..?
6. పట్టిసీమ గట్టు మట్టిని అక్రమంగా తరలించి రైతుల ద్రోహిని ఎలా పరామర్శిస్తావ్ జగన్ రెడ్డి..?
7. గన్నవరం నియోజకవర్గం ప్రజలకు 11 వేల దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చి సొంత ఇంటి కలను దూరం చేసిన వంశీని ఏ విధంగా మద్దతు పలుకుతావు జగన్ రెడ్డి..?
8. బాపులపాడు, గన్నవరం, మండవల్లి ప్రాంతాల్లో చెరువులను, కొండలను అక్రమంగా తవ్వించి అమ్ముకున్న గ్రావెల్స్ మాఫియా వంశీకి జగన్ ఎలా మద్దతు ఇస్తాడు..?
9. ఎయిర్ పోర్టు భూములను సైతం కబ్జా చేసిన వంశీని ఎందుకు కలుస్తున్నారో ఓసారి అత్మ పరిశీలన చేసుకో జగన్ రెడ్డి..?
10. విజయవాడ రూరల్ మండలంలో ఉన్న 9 గ్రామాల్లో ఒక్క లే అవుట్‌లో కూడా కామన్ సైట్‌ను కబ్జా చేసిన వంశీని ఎందుకు పరామర్శిస్తున్నావు జగన్ రెడ్డి..? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీతో మంగళవారం ఉదయం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ములాఖత్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీ టీడీపీ అధినేత పల్లా శ్రీనివాసరావు సూటిగా పలు ప్రశ్నలు సంధించారు.
For Andhrapradesh News And Telugu News