Share News

Advocate Posani Venkateshwarlu : రఘురామ హత్యకు కుట్రలో ప్రభావతి భాగస్వామి!

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:26 AM

మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజును హత్య చేసేందుకు పన్నిన కుట్రలో అప్పటి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌ ప్రభావతి భాగస్వామి అయ్యారని....

Advocate Posani Venkateshwarlu : రఘురామ హత్యకు కుట్రలో  ప్రభావతి భాగస్వామి!

  • వైద్య పరీక్షల నివేదికలను తొక్కిపెట్టారు

  • హైకోర్టుకు ప్రాసిక్యూషన్‌ నివేదన

  • ఆరోగ్య పరిస్థితి బాగున్నట్లు రిపోర్టు ఇవ్వాలని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై ఒత్తిడి

  • ప్రభావతి బెయిల్‌కు అర్హురాలు కాదు

  • సీనియర్‌ న్యాయవాది పోసాని వాదనలు

  • ముందస్తు బెయిల్‌పై ముగిసిన విచారణ

  • 10న నిర్ణయం వెల్లడిస్తామన్న కోర్టు

అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజును హత్య చేసేందుకు పన్నిన కుట్రలో అప్పటి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌ ప్రభావతి భాగస్వామి అయ్యారని ప్రాసిక్యూషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టుకు నివేదించారు. సీఐడీ కస్టడీలో ఉన్న రఘురామ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉన్నట్లు వైద్య నివేదిక ఇవ్వాలని కార్డియాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై ఒత్తిడి తెచ్చారని శుక్రవారం విచారణ సందర్భంగా తెలిపారు. వైద్యం అందకుండా చేసి రఘురామను అంతమొందించాలనేది అప్పటి సీఐడీ పోలీసుల ప్రణాళికగా పేర్కొన్నారు. ఆ కుట్రను ప్రభావతి కొనసాగించారని తెలిపారు. కస్టడీలో చిత్రహింసల ఆరోపణల నేపథ్యంలో జీజీహెచ్‌లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికను తమ ముందుంచాలని మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను ఆమె పట్టించుకోలేదని, రఘురామకు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందించాలన్న ఆదేశాలను కూడా పక్కన పెట్టి ఆయన్ను నేరుగా జైలుకు పంపించారని వెల్లడించారు. కోర్టు ఉత్తర్వుల పట్ల ప్రభావతికి గౌరవం లేదన్నారు. ఆస్పత్రిలోని ఇతర వైద్యులు రఘురామకు పరీక్షలు నిర్వహించి ఇచ్చిన నివేదికలను ఆమె తొక్కిపెట్టారన్నారు. డాక్టర్ల బృందంతో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికను తమ ముందుంచాలని ప్రభావతిని నాడు హైకోర్టు ఆదేశించిందని.. అయితే అరికాళ్లపై ఎడిమా మినహా ఆరోగ్య పరిస్థితి సవ్యంగా ఉందంటూ ఆమె తప్పుడు నివేదిక ఇచ్చారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షలో రఘురామ కాలి మునివేళ్లు చిట్లినట్లు వైద్యులు గుర్తించారన్నారు. అలాగే పోలీసులు కొట్టిన దెబ్బలకు నరాలు చిట్లి అంతర్గతంగా బ్లీడింగ్‌ జరుగుతున్నట్లు కూడా కనుగొన్నారని వివరించారు.


రఘురామను కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్లు సుప్రీంకోర్టు సైతం ప్రాథమికంగా నిర్ధారించిందని గుర్తుచేశారు. కేసు దర్యాప్తులో భాగంగా రఘురామ వైద్య పరీక్షల నివేదికలను దర్యాప్తు అధికారి విజయవాడ మెడికల్‌ బోర్డుకు పంపించారని.. ఎక్స్‌రే రిపోర్ట్‌లో రఘురామ మునివేళ్లు రాకుండా చేసినట్లు బోర్డు గుర్తించిందన్నారు. రఘురామను చిత్రహింసలకు గురిచేసిన సీఐడీ అధికారులను కాపాడేందుకు ప్రభావతి అన్నివిధాలా ప్రయత్నించారని తెలిపారు. తన అధికార హోదాను అడ్డుపెట్టుకుని రికార్డులను తారుమారు చేశారని.. ముందస్తు బెయిల్‌ పొందేందుకు అనర్హురాలని పేర్కొన్నారు. ప్రభావతి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం ఇరుపక్షాల వాదనలు ముగియడంతో.. ఈ నెల 10న నిర్ణయం వెల్లడిస్తానని న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ ప్రకటించారు. అప్పటివరకు ఆమెపై ఎలాంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు.

Updated Date - Jan 04 , 2025 | 04:26 AM

News Hub