Share News

Raghuram Krishna Raju : అసెంబ్లీకి రాకుంటే.. జగన్‌ సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దు!

ABN , Publish Date - Feb 04 , 2025 | 05:06 AM

అసెంబ్లీ 60 పని దినాలలో ఎలాంటి సమాచారమూ లేకుండా గైర్హాజరైతే అతడి శాసన సభ్యత్వం ఆటోమేటిగ్గా రద్దవుతుందని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

Raghuram Krishna Raju : అసెంబ్లీకి రాకుంటే.. జగన్‌ సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దు!
YS Jagan

  • సునీల్‌ని ఎందుకు సస్పెండ్‌ చేయట్లేదు?

  • బాధితుడిగా ప్రశ్నించే హక్కు నాకుంది

  • డిప్యూటీ స్పీకర్‌ రఘు రామకృష్ణరాజు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా కోసం కోర్టులో కేసు వేశానంటే కుదరదని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. అసెంబ్లీ 60 పని దినాలలో ఎలాంటి సమాచారమూ లేకుండా గైర్హాజరైతే అతడి శాసన సభ్యత్వం ఆటోమేటిగ్గా రద్దవుతుందని తేల్చిచెప్పారు. సోమవారం ఢిల్లీ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోవచ్చు కదా! అని విలేకరులు పేర్కొనగా.. శాసనసభ్యత్వాన్ని కాపాడుకోడానికి ఈ ప్రయత్నం బాగానే ఉంటుంది కానీ, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానన్న ఆయన మాటలకు విశ్వసనీయ త ఉండదన్నారు. ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడేందుకు సమయం లభించదన్న జగన్‌ వాదనలో పస లేదన్నారు. కంటెంట్‌ ఉంటే స్పీకర్‌ సమయాన్ని ఇస్తారని, మంత్రులు సమాధానం చెబుతారని తెలిపారు. మీరు సభాపతి స్థానం లో కూర్చుంటే అధ్యక్షా అని సంబోధించాల్సి వస్తుందని జగన్‌ హాజరుకావట్లేదేమోనని విలేకరులు పే ర్కొనగా.. సభాపతి స్థానంలో ఎవరు కూర్చున్న అధ్య క్షా అనాల్సిందేనన్నారు. తన కస్టోడియల్‌ టార్చర్‌ కేసు లో సీఐడీ విభాగం మాజీ అధిపతి పీవీ సునీల్‌కుమార్‌ను ఇప్పటివరకు ఎందుకు సస్పెండ్‌ చేయలేదని రఘురామ ప్రశ్నించారు.


రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ, ఒక బాధితుడిగా ప్రశ్నించే హక్కు తనకు ఉందన్నారు. చట్టాన్ని అతిక్రమించి చట్టసభల సభ్యుడినైన తనను చితక్కొట్టి, కాలు, వేలు విరిచిన నాటి నుంచి న్యాయపోరాటం చేస్తున్నానని చెప్పారు. గుం టూరు ప్రభుత్వాస్పత్రి మాజీ సూపరింటెండెంట్‌ ప్రభావతి సుప్రీంకోర్టులో అత్యంత ఖరీదైన న్యాయవాదులను నియమించుకున్నారని, వారికి చెల్లించే ఫీజు ను ఆమే సమకూర్చుకున్నారా? లేక ఆమెతో తప్పు చేయించినవారు సమకూర్చారా? అని ప్రశ్నించారు. సునీల్‌ కుమార్‌కు కుడి భుజంగా వ్యవహరించిన తులసిబాబు అన్ని దోపిడీల్లోను ఆయనకు సహకరించాడని, సీఐడీ విభాగం న్యాయ సలహాదారుగా కూడా పని చేసినట్టు తెలిసిందని చెప్పారు. ఈ కేసులో సునీల్‌కుమార్‌ను సస్పెండ్‌ చేయకపోతే సాక్షులు వాంగ్మూలం ఇవ్వడానికి భయపడతారన్నారు.

Updated Date - Feb 04 , 2025 | 08:53 AM