Kurnool : సెమీకండక్టర్ పరిశ్రమ
ABN , Publish Date - Jan 12 , 2025 | 03:18 AM
కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పా ర్కులో రూ.14వేల కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కానుంది.
14 వేల కోట్లతో ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్న ఇండిచిప్
దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ సెమీకండక్టర్ ఫాబ్
మంత్రి లోకేశ్ సమక్షంలో అవగాహన ఒప్పందం
అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పా ర్కులో రూ.14వేల కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఇండిచిప్ లిమిటెడ్ కంపెనీ.. జపాన్‌కు చెందిన తన భాగస్వామ్య సంస్థ యితో మైక్రో టెక్నాలజీ లిమిటెడ్‌తో కలిసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ సెమీ కండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏపీలో స్థాపించడానికి ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధులు గత నెలలో మంత్రి నారా లోకేశ్‌ను కలిసి చర్చలు జరిపారు. కంపెనీ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో అవసరమైన భూమి ని కేటాయించి, మౌలిక సదుపాయాలు, ఎకోసిస్టమ్‌ను అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో కంపెనీ ప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లో మంత్రి లోకేశ్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకున్నారు. ఒప్పందంపై ఇండిచిప్ మేనేజింగ్ డైరెక్టర్ పీయూష్ బిచ్చోరియా, ఏపీ ఈడీబీ సీఈవో సాయికాంత్‌వర్మ సంతకాలు చేశారు. మం త్రి లోకేశ్ మాట్లాడుతూ దేశంలో గ్లోబల్ సెమీ కండక్టర్ అభివృద్ధిని మరింత బలోపేతం చేయడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు. ఈ ప్రాజెక్టును రెండున్నరేళ్లలో పూర్తి చేయాలనే కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఓర్వకల్లు పారిశ్రామికవాడలో నూతన ఆవిష్కరణలతోపాటు అనుబంధ పరిశ్రమల అభివృద్ధి ద్వారా వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్, ఇండిచిప్ డైరెక్టర్లు డాక్టర్ సందీ్‌పగార్డ్, వెబ్‌చాంగ్, యితో మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్ చైర్మన్ డేవిడ్ యార్క్ యువాన్ చాంగ్, సీఈవో మోటోసుగి కీసుకె తదితరులు పాల్గొన్నారు.