the pond invasion: ఇక్కడో కోనేరుండేది!
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:51 PM
the pond invasion:అది పారిశ్రామికవాడ.. జాతీయ రహదారి చెంతనే ఉంది. అక్కడ సెంటు రూ.లక్షల్లో పలుకుంది. ఇంకేముంది అక్రమార్కుల కన్ను ఓ కోనేరుపై పడింది.
-పైడిభీమవరంలో రూ.కోట్ల స్థలం ఆక్రమణ
-స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారుల మౌనం
అది పారిశ్రామికవాడ.. జాతీయ రహదారి చెంతనే ఉంది. అక్కడ సెంటు రూ.లక్షల్లో పలుకుంది. ఇంకేముంది అక్రమార్కుల కన్ను ఓ కోనేరుపై పడింది. అక్కడ భూగర్భ జలాలకు ఇదే పెద్దదిక్కు. అయినా వారికి ఇదేమీ పట్టలేదు. మట్టిని కొంచెం కొంచెం కోనేరు గర్భంలో వేశరు. చివరకు రూ.కోట్ల స్థలం కబ్జా చేసేశారు. ఇప్పుడు అక్కడ కోనేరు ఆనవాళ్లే లేకుండా చేశారు.
రణస్థలం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): నాలుగు దశాబ్దాల కిందట పైడిభీమవరంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేశారు. పరిశ్రమల ఏర్పాటుతో తమ బతుకులు మారిపోతాయని స్థానికులు భావించారు. కానీ నీరు, జలం, వాయువు అన్నీ కలుషితం అయ్యాయి. దీనికితోడు సహజ వనరుల దోపిడీ ప్రారంభమైంది. పరిశ్రమల వ్యర్థాలతో కందివలస గెడ్డ పూర్తిగా కలుషితమైంది. ఇప్పుడు గ్రామస్థులు సాగు, ఇతరత్రా అవసరాలు తీర్చే సుద్ద కోనేరు పూర్తిగా ఆక్రమణల చెరలో చిక్కింది. 2 ఎకరాల 36 సెంట్ల విస్తీర్ణం కలిగిన ఈ కోనేరు చిన్నపాటి కాలువగా మిగిలింది. సుమారు రూ.40 కోట్ల విలువ చేసే భూమి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతోంది.
భూగర్భ జలాలకు దిక్కు..
జాతీయ రహదారి పక్కనే పైడిభీమవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 103లో 12లో సుద్ద కోనేరు ఉంది. దీని విస్తీర్ణం 2.36 ఎకరాలు. పారిశ్రామికవాడ ఏర్పాటుచేయక ముందు దీన్ని సాగు, తాగు నీటి అవసరాలకు వినియోగించేవారు. చుట్టుపక్కల పరిశ్రమలు, భారీ నిర్మాణాలు ఏర్పాటు చేయడంతో సాగు నిలిచిపోయింది. అయితే పైడిభీమవరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఈ కోనేరు ఎంతగానో దోహదపడేది. పక్కనే ఉన్న కందివలస గెడ్డ.. వ్యర్థాలతో నిండి భూగర్భ జలాలు కలుషితం కావడంతో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కోనేరులో నీటి నిల్వలతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా లభించేవి. అలాంటి కోనేరు ఇప్పుడు పూర్తిగా కబ్జాకు గురైంది.
సెంటు ధర రూ.20 లక్షలకుపైగా..
ఇక్కడ సెంటు భూమి రూ.20 లక్షలపైమాటే. పైగా జాతీయ రహదారి చెంతనే ఉండడంతో ఈ భూమికి భలే గిరాకీ. అందుకే అక్రమార్కులు సుదూర ప్రాంతాల నుంచి మట్టిని తెచ్చి కోనేరు గర్భంలో పోస్తున్నారు. క్రమేపీ నాలుగు వైపులా చదును చేశారు. ఇలా పరాధీనంలోకి వెళ్లిన భూమి విలువ రూ.40 కోట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వెలుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమార్కులకు రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల అండ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరముంది.
దారుణం
గతంలో ఈ కోనేరు సాగు, తాగు నీటి అవసరాలను తీర్చేది. దాన్ని మట్టితో కప్పేస్తున్నారు. స్వాధీనం చేసుకుంటున్నారు. పైడిభీమవరంలో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటాయి. కోనేరు కొంతవరకూ జలాలను కాపాడుతోంది. దాన్ని కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోక పోవడం దారుణం.
- స్థానికుడు, పైడిభీమవరం
మా పరిస్థితి దయనీయం..
గ్రామం చెంతనే ఉన్న కందివలస గెడ్డ పూర్తిగా కలుషితం అయింది. వ్యర్థాలతో నిండిపోయి సాగు, తాగునీటి అవసరాలు తీరకుండా పోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క ఆధారంగా ఉన్న కోనేరు సైతం కబ్జాకు గురికావడం బాధగా ఉంది. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ చర్యలకు ముందుకు రాలేదు.
- స్థానికుడు, పైడిభీమవరం
విచారణ చేయిస్తాం
పైడిభీవమరం కోనేరు ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టిపెడతాం. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. సిబ్బందిని పంపి పరిశీలన చేయాలని ఆదేశించాం. ఆక్రమణలకు గురైతే బాధ్యులకు నోటీసులిస్తాం. ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటుచేస్తాం.
- ఎన్.ప్రసాద్, తహసీల్దారు, రణస్థలం