మోహన్‌బాబు వర్సిటీ వద్ద హై టెన్షన్
ABN , Publish Date - Jan 16 , 2025 | 03:27 AM
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంప్‌సలోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక ప్రయత్నించగా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

క్యాంప్‌సలోకి వెళ్లేందుకు మనోజ్ దంపతుల యత్నం.. అడ్డుకున్న పోలీసులు, సిబ్బంది
మనోజ్ వాహనంపై కర్రతో యువకుడి దాడి
విష్ణు అనుచరులపై పరోక్షంగా మనోజ్ ఫైర్
కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఫిర్యాదు చేస్తాం: ఎంబీయూ మీడియా ఇన్‌చార్జ్
తిరుపతి(వైద్యం)/చంద్రగిరి, జనవరి 15(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంప్‌సలోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక ప్రయత్నించగా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. చివరికి క్యాంపస్ పక్కన ఫామ్‌హౌ్‌సలోని తన నానమ్మ, తాత సమాధులకు నమస్కరించి మనోజ్ వెనుదిరిగారు. మండలంలోని ఎ.రంగంపేటలో సినీనటుడు మంచు మోహన్‌బాబుకు చెందిన పలు విద్యాసంస్థలు ఉన్నాయి. కొంతకాలంగా ఆయన కుటుంబంలో వివాదం తలెత్తి కుమారుడు మనోజ్‌తో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. తన విద్యాసంస్థల్లోకి మనోజ్ ప్రవేశించకుండా అడ్డుకోవాలని కోరుతూ మోహన్‌బాబు కోర్టును ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు పొందారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ శ్రీనివాసమంగాపురం నుంచి రంగంపేట వరకూ దారిపొడవునా మనోజ్ అనుచరులు సుమారు 200 బ్యానర్లు ఏర్పాటు చేశారు. వాటిని బుధవారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు.
మంచు విష్ణు అనుచరులు చేసిన పనిగా ప్రచారమైంది. బుధవారం మధ్యాహ్నం మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. తొలుత నారావారిపల్లె వెళ్లి, మంత్రి లోకేశ్‌ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత రంగంపేట వచ్చి జల్లికట్టు వీక్షించారు. అనంతరం మోహన్‌బాబుకు చెందిన స్కూల్ క్యాంపస్ ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. అంతకుముందే అక్కడకు భారీగా చేరుకున్న పోలీసులు, క్యాంపస్ సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్ద మోహరించి, మనోజ్‌ను అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నందున లోపలకు అనుమతించలేమని స్పష్టం చేయడంతో ఆయన వారితో వాగ్వాదానికి దిగారు. తాను ఇక్కడే పుట్టి పెరిగానని, తన ఇంటికి తనను ఎందుకు వెళ్లనివ్వరని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను గౌరవించాలని పోలీసు అధికారులు నచ్చజెప్పడంతో అంగీకరించిన మనోజ్ గేటు వద్ద బౌన్సర్లను ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ‘ఎంతమంది బౌన్సర్లను పంపుతారో పంపండి... నేను ఒక్కడిని చాలు వారికి సమాధానం చెప్పడానికి’ అంటూ సవాల్ విసిరారు.
ఆ తర్వాత అక్కడనుంచి బయల్దేరి పక్కనే ఉన్న కాలేజీ క్యాంపస్ ప్రధాన గేటు వద్దకు వెళుతుండగా విష్ణు అనుచరులుగా భావిస్తున్న యువకుల బృందంలో ఒకరు కర్రతో మనోజ్ వాహనంపై బాదారు. ఆ గేటు వద్ద కూడా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది మనోజ్‌ను నిలువరించారు. దీంతో ఆగ్రహించిన మనోజ్ గేటు దూకైనా లోపలకు వెళతానంటూ దాన్ని ఎక్కేందుకు యత్నించారు. మరోవైపు ఆయన అనుచరులు సైతం గేటుపైకి ఎక్కడంతో ఇరుపక్షాలకు చెందినవారి మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో గందరగోళం నెలకొనడంతో సిబ్బంది ప్రధాన గేటు కాకుండా చిన్న గేటును తెరిచారు. దానినుంచి మనోజ్ దంపతులు లోపలకు వెళ్లి మోహన్‌బాబు తల్లిదండ్రుల సమాధులకు నివాళులర్పించి వెనుదిరిగారు. సుమారు అరగంట పాటు అరుపులు, కేకలు, నినాదాలతో అక్కడ గందరగోళం నెలకొంది. కాగా, కోర్టు ధిక్కరణకు పాల్పడిన మంచు మనోజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి, కోర్టుకు అప్పీలుకు వెళ్లనున్నట్లు ఎంబీయూ మీడియా ఇన్‌చార్జ్ రవిచంద్రబాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.