TDP Leaders: టీడీపీ నేతలపై‘ఓబుళాపురం’ కేసు కొట్టివేత
ABN , Publish Date - Mar 14 , 2025 | 03:57 AM
ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఓబుళాపురంలోని ఐరన్ ఓర్ తవ్వకాలను పరిశీలించడానికి వెళ్లిన టీడీపీ నేతలపై నమోదు చేసిన కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం కొట్టేసింది.

విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు
న్యాయస్థానం ప్రాంగణంలో తెలంగాణ, ఏపీ నేతల ముచ్చట్లు
విజయవాడ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఓబుళాపురంలోని ఐరన్ ఓర్ తవ్వకాలను పరిశీలించడానికి వెళ్లిన టీడీపీ నేతలపై నమోదు చేసిన కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం కొట్టేసింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓబుళాపురం గనులను గాలి జనార్దన్‌రెడ్డికి కేటాయించారు. ఇక్కడ అనధికారికంగా తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపిస్తూ.. వాటిని పరిశీలించడానికి టీడీపీ బృందం 2007 జూలై 21వ తేదీన అక్కడకు వెళ్లింది. ఈ బృందానికి అప్పటి నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే, టీడీఎల్పీ ఉపనేత నాగం జనార్దన్‌రెడ్డి నేతృత్వం వహించారు. ఓబుళాపురం పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ నిషేధాజ్ఞలను ఉల్లంఘించారంటూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అచ్చెన్నాయుడు, ఎర్రబెల్లి దయాకరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, పడాల అరుణ, అమరనాథ్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, చిన్నం బాబురమేశ్, కోళ్ల లలితకుమారి, బొమ్మడి నారాయణరావు, మసాల పద్మజ, పూల నాగరాజు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, గురుమూర్తి, మెట్టు గోవిందరెడ్డి, వైవీబీ రాజేంద్రప్రసాద్, హరీశ్వరర్‌రెడ్డితో పాటు మొత్తం 21 మందిపై డి.హీరేహళ్ పోలీసులు ఐపీసీ 143, 188, 447, 186, 506, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద కేసు (క్రైం నం.34/2007) నమోదు చేశారు.
కేసు విచారణలో ఉండగా.. రంగనాయకులు, హరీశ్వర్‌రెడ్డి, కొలకర్ల రమణ మరణించారు. ఇటీవల వాదనలు పూర్తి కావడంతో న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ తరఫున తెల్లాప్రగడ సుబ్బారావు.. నాగం జనార్దన్‌రెడ్డి, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ తరఫున గూడపాటి లక్ష్మీనారాయణ.. మిగిలిన నిందితుల తరఫున గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ వాదనలు వినిపించారు. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టేస్తున్నట్టు న్యాయాధికారి ఎస్.శ్రీదేవి ప్రకటించారు.