Vijayawada Police: పిల్లల్ని అమ్మే ముఠా అరెస్టు
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:44 AM
ఉత్తరాది నుంచి చిన్నపిల్లలను కొనుగోలు చేసి విజయవాడకు తీసుకొచ్చి విక్రయిస్తున్న మహిళల ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు.

ఉత్తరాదిలో కొనుగోలు..విజయవాడలో విక్రయాలు
మొత్తం ఏడుగురు శిశువులను తెచ్చినట్టు గుర్తింపు
ముగ్గురు చిన్నారులను కాపాడిన పోలీసులు
పట్టుబడిన ఐదుగురు మహిళలు
విజయవాడ, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఉత్తరాది నుంచి చిన్నపిల్లలను కొనుగోలు చేసి విజయవాడకు తీసుకొచ్చి విక్రయిస్తున్న మహిళల ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు మహిళలను అరెస్టు చేసి ముగ్గురు శిశువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు శనివారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. విజయవాడ సితార సెంటర్‌కు చెందిన బగలం సరోజిని గతంలో ఓ సంతాన సాఫల్య కేంద్రంలో పనిచేసింది. అక్కడ అండాలను దానం చేయించి కమీషన్లు తీసుకుంది. ఆ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ పరిచయమైంది. ఆమె ఢిల్లీ యువతి ప్రీతి కిరణ్, అహ్మదాబాద్ వ్యక్తి అనీల్‌లను సరోజినికి పరిచయం చేసింది. ఉత్తరాది నుంచి ఆడ శిశువును రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు, మగ శిశువును రూ.4 లక్షల నుంచి రూ.4.50 లక్షలకు సరోజిని కొనుగోలు చేసేది. మరో రూ.50 వేలు లాభం వేసుకుని సంతానం లేని దంపతులకు ఆ పిల్లలను విక్రయించేది. ఉత్తరాది నుంచి ఏడుగురు శిశువులను తెచ్చినట్టు పోలీసులు గుర్తించారు. వారిలో నలుగురిని ఇప్పటికే విక్రయించేశారు. మరో ముగ్గురిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి, రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు శిశువులను బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విక్రయించిన నలుగురు శిశువులనూ త్వరలో తీసుకొచ్చి బాలల సంరక్షణ కేంద్రంలో అప్పగిస్తామని చెప్పారు. కాగా, సరోజినిపై హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీసుస్టేషన్లో పలు కేసులు ఉన్నాయి. హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినప్పుడు 40 మంది శిశువులను విక్రయించినట్టు అంగీకరించింది.