College Lecturer : ఒకరిద్దరిని కాదు.. 40 మందిని..!!
ABN , Publish Date - Jan 01 , 2025 | 06:39 AM
విశాఖ జిల్లాలోని తగరపువలస బాసర జూనియర్ కళాశాలలో మంగళవారం కెమిస్ట్రీ లెక్చరర్ మహేష్ పూనకం వచ్చినట్లు ఎంపీసీ ఇంగ్లీషు మీడియం విద్యార్థులను చావబాదారు.
ఇంటర్ విద్యార్థులను చితకబాదిన లెక్చరర్
చర్యలకు అధికారుల మీనమేషాలు
తగరపువలస, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లాలోని తగరపువలస బాసర జూనియర్ కళాశాలలో మంగళవారం కెమిస్ట్రీ లెక్చరర్ మహేష్ పూనకం వచ్చినట్లు ఎంపీసీ ఇంగ్లీషు మీడియం విద్యార్థులను చావబాదారు. చదువుపై శ్రద్ధ చూపడంలేదన్న సాకుతో విచక్షణ మరచి ఏకంగా తరగతి గదిలోని 40 మందినీ కర్రతో చితక్కొట్టారు. విద్యార్థుల ఒంటిపై తట్లు తేలడం, ఓ విద్యార్థి చేతి వేలు చిట్లి రక్తం కారడంతో ఫొటోలు తీసి విద్యార్థి సంఘం నాయకులకు పంపించడంతో, ఈ విషయం తెలిసి, దానిపై కూడా కళాశాల యాజమాన్యం కూడా విద్యార్థులను వేధించింది. ఎవరు ఫొటోలు తీశారు?, ఎవరికి పంపించారో చెప్పాలంటూ మరోసారి వారిని కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఏఐడీఎ్‌సఓ విద్యార్థి సంఘం విశాఖ జిల్లా నాయకుడు బి.సంతోష్.. ఆర్‌ఐఓకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు కూడా కళాశాల యాజమాన్యానికే వత్తాసు పలుకుతున్నట్టు మాట్లాడారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. పిల్లలు సరిగా చదవలేదని, మార్కులు తక్కువ వచ్చాయని వాతలు వచ్చేలా కొడతారా? అంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం రచ్చకాకుండా చూసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులను రప్పించి వారితో మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు. విద్యార్థులను కొట్టిన లెక్చరర్ మహే్‌షపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని కళాశాల చైర్మన్ పి.రమేష్ ‘ఆంధ్రజ్యోతి’కి వివరణ ఇచ్చారు.