Share News

PM Modi: విశాఖ పర్యటనకు పీఎం మోదీ.. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

ABN , Publish Date - Jan 08 , 2025 | 07:17 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. 12కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఆరుకు పైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు.

PM Modi: విశాఖ పర్యటనకు పీఎం మోదీ.. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
PM Modi visakhapatnam

విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) బుధవారం విశాఖ (Visakha) పర్యటనకు (Visit) వస్తున్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)ను మరో ఎత్తుకు చేర్చుతూ రూ.రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటుచేసే గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ విలువే రూ.1.85లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా రూ.19.5 వేల కోట్లు. వీటితోపాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. కొత్తగా నిర్మించిన, విస్తరించిన ఆరు రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ప్రధాని వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Deputy CM Pawan Kalyan) కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.


ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ మార్గంలోని రహదారిని ప్రత్యేక బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 1.5 లక్షల మందిని సమీకరిస్తున్నారు. సభ వేదికపై మోదీతో పాటు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, సత్యకుమార్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యుడు సుందరపు విజయకుమార్‌ ఉంటారు. ప్రధానికి కుడి వైపున గవర్నర్‌, ఎడమ వైపున ముఖ్యమంత్రికి సీట్లు కేటాయించారు. పవన్‌కల్యాణ్‌, చంద్రబాబు ప్రసంగించిన తరువాత ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాలు ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తారు. ప్రధాని ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అనువదిస్తారు.


శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు..

ప్రధాని మోదీ విశాఖ సభా వేదికగా 12కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఆరుకు పైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పనుల విలువ దాదాపు రూ. రెండు లక్షల కోట్ల పైమాటే. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్‌టీపీసీ రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ఏర్పాటు. 57 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టును 1,600 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు.

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్కుకు శంకుస్థాపన.

కృష్ణపట్నానికి సంబంధించిన ఇండస్ట్రియల్‌ నోడ్‌.

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన.

ఆదోని పట్టణం నుంచి ఎన్‌హెచ్‌-167ను కలుపుతూ బైపాస్‌ రహదారి

కొండమోరు నుంచి పేరేచర్ల రహదారి విస్తరణ

సంగమేశ్వరం నుంచి ఆత్మకూరు వరకు రహదారి విస్తరణ

వేంపల్లి నుంచి చాగలమర్రి వరకు ఎన్‌హెచ్‌-440 నాలుగు లేన్లకు విస్తరణ

ఎన్‌హెచ్‌-516 నుంచి పాడేరు బైపాస్‌ రహదారి నిర్మాణం

గుంటూరు నుంచి బీబీ నగర్‌ వరకు రైల్వే లైన్‌ డబ్లింగ్‌

మహబూబ్‌ నగర్‌ నుంచి కర్నూల్‌ మీదుగా డోన్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌

గుత్తి-పెండేకల్లు రైల్వే లైన్‌ డబ్లింగ్‌.

రూ.19,500 కోట్ల విలువైన రహదారులు, రైల్వే ప్రాజెక్టులు.. ఇంకా ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.


టూర్ షెడ్యూల్‌..

బుధవారం సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని మోదీ విశాఖకు చేరుకుంటారు. సాయంత్రం 4.45 గంటల నుంచి 5.30 గంటల వరకు వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్‌ ప్రాంతం నుంచి సుమారు కిలోమీటరు మేర రోడ్డు షోలో పాల్గొంటారు. సాయంత్రం 5.30 నుంచి 6.45 వరకూ ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలోని సభా వేదిక వద్ద నుంచి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సభలో మాట్లాడతారు. సాయంత్రం 6.50 గంటలకు సభా వేదిక నుంచి బయలుదేరి విమానాశ్రయానికి చేరుకుని 7.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరి వెళతారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అరెస్టుకు వేళాయెనా..?

బ్యాంకులదే పూర్తి బాధ్యత

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 08 , 2025 | 07:17 AM