Vision 2047 AP Goals: స్వర్ణాంధ్ర లక్ష్యంగా కార్యాచరణ
ABN , Publish Date - Mar 25 , 2025 | 05:56 AM
విజన్-2047 లక్ష్యాలను సాధించేందుకు, స్వర్ణాంధ్ర స్థితిని పురస్కరించుకొని, ప్రభుత్వం మంగళ, బుధ వారాల్లో జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో పీ4 అమలు, డిజిటల్ అడ్మినిస్ట్రేషన్, సంక్షేమ పథకాల అమలు వంటి ముఖ్య అంశాలు చర్చించబడతాయి.

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు.. అంతా డిజిటల్‌గానే
ఈసారి కలెక్టర్ల ప్రజంటేషన్లకే ప్రాధాన్యం
శాఖల సుదీర్ఘ ప్రజంటేషన్లకు స్వస్తి
సచివాలయ ఐదో బ్లాక్‌లో నిర్వహణ
పేపర్ నివేదికలుండవ్.. అంతా డిజిటల్‌గానే
రెవెన్యూ కార్యదర్శి ప్రజంటేషన్ లేకుండా చేసిన సీఎంవో
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా విజన్-2047 అమలు, దిశాదశపై చర్చించేందుకు మంగళ, బుధ వారాల్లో జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర సచివాలయ ఐదో బ్లాక్‌లోని సమావేశం మందిరంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వం వచ్చిన కొత్తలో తొలిసారిగా కలెక్టర్ల సమావేశాన్ని గతేడాది ఆగస్టులో ఒక్క రోజే నిర్వహించింది. రెండోదఫా డిసెంబరులో సమావేశాలు జరిగాయి. అప్పటికి రాష్ట్రంలో పరిస్థితిపై ప్రభుత్వానికి ఓ స్పష్టత వచ్చింది. జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చడం, కొత్తగా ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మూడో సమావేశాలకు సచివాలయం వేదిక కానుంది. విజన్-2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలు, పీ4 అమలు, డిజిటల్ అడ్మినిస్ట్రేషన్, వాట్సాప్ గవర్నెన్స్, సంక్షేమ పథకాల అమలు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే కొత్త పథకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే విజన్-2047 డాక్యుమెంట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. దానిపై కూలంకశంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఇదీ అజెండా
మంగళవారం ఉదయం 10గంటలకు సమావేశాన్ని సీసీఎల్‌ఏ జయలక్ష్మి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఐదు నిమిషాలు ప్రసంగిస్తారు. అనంతరం రెవెన్యూ, ఆర్థికశాఖల మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ మాట్లాడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 40 నిమిషాలపాటు కలెక్టర్లను ఉద్దేశించి కీలక అంశాలపై మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఆర్థికాభివృద్ధిపై ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 30 నిమిషాల ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం వాట్సాప్ గవర్నెన్స్, ఆర్‌టీజీఎస్ అంశాలపై ఐటీశాఖ కార్యదర్శి ప్రజంటేషన్ ఉంటుంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూమి, రీ సర్వే సమస్యలపై సీసీఎల్‌ఏ ప్రజంటేషన్లు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం సెషన్‌లో వాతావరణ పరిస్థితులు, వేసవి సన్నద్ధత, తాగునీటి సమస్య, వేసవి కార్యాచరణ ప్రణాళికలపై ఆయా శాఖల అధికారులు చర్చించనున్నారు. తొలి రోజే శాంతిభద్రతలు, రెవెన్యూ, ఇతర కీలక అంశాలపై చ ర్చించాలని నిర్ణయించారు.
కలెక్టర్లు చెప్పేది వినాలని..
గతానికి భిన్నంగా ఈ సారి జిల్లా కలెక్టర్లు చెప్పేది వినాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల్లో ఆర్థికాభివృద్ధి, ప్రణాళికల అమలు, ఇతర ప్రత్యేక అంశాలపై కలెక్టర్లతో ప్రజంటేషన్లు ఇప్పించనున్నారు. తమకు జిల్లా పరిధిలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి? కొత్తగా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి? తదితర అంశాలపై కలెక్టర్లు సగటున 8 పీపీటీ స్లైడ్స్‌తో 15 నిమిషాల పాటు ప్రజంటేషన్ ఇచ్చేలా కార్యక్రమం ఖరారు చేశారు.
రెవెన్యూకు చోటేది?
జిల్లా కలెక్టర్ల సమావేశం అంటే రెవెన్యూశాఖ పాత్రే కీలకం. ఆ శాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏలే కీలక పాత్రధారులు. గతంలో ప్రతి సమావేశంలోనూ రెవెన్యూ కార్యదర్శి ప్రజంటేషన్ విధిగా ఉండేది. అయితే, ఈ సమావేశంలో ఫార్మాట్‌నే మార్చేశారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రజంటేషన్ లేకుండా సీఎంవో అధికారులు అజెండాను రూపొందించారు. ఇది ఐఏఎస్‌ల్లో కొత్త చర్చను లేవనెత్తింది. దీని వెనక కారణాలు ఏమిటన్న చర్చలు సాగుతున్నాయి.
For AndhraPradesh News And Telugu News