Share News

the Shambara fair: శంబర జాతరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Jan 02 , 2025 | 11:14 PM

the Shambara fair:శంబర పోలమాంబ జాతరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.

the Shambara fair:  శంబర జాతరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): శంబర పోలమాంబ జాతరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే జాతరకు సంబంధించి ఏర్పాట్లపై గురువారం తన కార్యాలయంలో కలెక్టర్‌ సమీక్షించారు. ‘జాతరను విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి.


తాగునీటి సరఫరాలో అత్యంత జాగ్రత్తతతో వ్యవహరించాలి. కొరత లేకుండా చూడాలి. అవసరమైన పైపులైన్లు ముందుగా వేసి నిరంతరం సరఫరా చేయాలి. తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన మరుగుదొడ్లు నిర్మించాలి. విద్యుత్‌ సరఫరాలో సరైన పర్యవేక్షణ ఉండాలి. నడక, క్యూలైన్ల మార్గాల్లో భక్తులకు ఎటువంటి ఆటంకం ఉండరాదు. వైద్య శిబిరాలు నిర్వహించాలి. ప్రజా రవాణా శాఖ తగినన్ని బస్సులను ఏర్పాటు చేయాలి. పోలీసులు బందోబస్తు, కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలి.’ అని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌ దిలీప్‌కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.


పౌష్టికాహార కిట్లను సిద్ధం చేయండి

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు అందించేందుకు పౌష్టికాహార కిట్లను సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్‌, డీఆర్‌డీఏ తదితర అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జిల్లాలోని గర్భిణుల్లో హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా చింతపండును వినియోగించడం ద్వారా హిమోగ్లోబిన్‌ తగ్గే అవకాశం ఉంది.


దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. చింతపండుకు బదులుగా పులుపునిచ్చే ఇతర పదార్థాలను వంటల్లో వినియోగించాలని ప్రజలకు చెప్పాలి. అంగన్‌వాడీలు ఇచ్చే ఆహారంతో పాటు న్యూట్రీషన్‌ కిట్లను గర్భిణులు వినియోగించవల్ల వారిలో హిమోగ్లోబిన్‌ బాగా పెరుగుతుంది.’అని తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో విజయపార్వతి, నోడల్‌ అధికారి ఎం.వినోద్‌కుమార్‌, జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి వాగ్దేవి, ఐసీడీఎస్‌ పీడీ టి.కనకదుర్గ, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు, డీపీవో టి.కొండలరావు, గ్రామ వార్డు, సచివాలయాల సమన్వయాధికారి బి.రామ్‌గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.


12న యువజన ఉత్సవ్‌

ఈ నెల 12న యువజన ఉత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని స్థానిక లయన్స్‌ క్లబ్‌లో యువజన్‌ ఉత్సవ్‌ నిర్వహించనున్నట్టు చెప్పారు. విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. మరిన్ని వివరాలకు 98484 18582, 63046 37663 నెంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, సెట్విజ్‌ సీఈవో రాజగోపాల్‌, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు బి.ఎన్‌.బి.రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 11:14 PM