Tribal: వారు కొనరు.. వీరు అమ్ముకోనివ్వరు
ABN , Publish Date - Jan 02 , 2025 | 11:33 PM
Tribal:సీతంపేట ఏజెన్సీలో గిరిజన రైతులు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకపక్క ఆరుగాలం కష్టపడి సేకరించిన గిరిజన ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరను జీసీసీ (గిరిజన సహకార సంఘం) కల్పించకపోగా, మరోపక్క ఉన్న అటవీ ఉత్పత్తులను విక్రయించేందుకు అటవీశాఖ అభ్యంతరాలు చెబుతోంది. దీంతో గిరిజన రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
- కొనుగోలు చేయని జీసీసీ
-వ్యాపారులకు అమ్మితే కేసులు నమోదు చేస్తున్న అటవీశాఖ
- బతికేదెలా అంటున్న అడవి బిడ్డలు
- సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నపం
సీతంపేట రూరల్, జనవరి 2(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో గిరిజన రైతులు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకపక్క ఆరుగాలం కష్టపడి సేకరించిన గిరిజన ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరను జీసీసీ (గిరిజన సహకార సంఘం) కల్పించకపోగా, మరోపక్క ఉన్న అటవీ ఉత్పత్తులను విక్రయించేందుకు అటవీశాఖ అభ్యంతరాలు చెబుతోంది. దీంతో గిరిజన రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
కొండచీపుర్లను కొనట్లే..
సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా గిరిజన రైతులకు లాభాన్ని తీసుకువచ్చే పంట ఏదైనా ఉంది అంటే అది కొండచీపుర్లే. మన్యం ప్రాంతంలో సుమారు 6 వేల ఎకరాల్లో ఈ పంటను గిరిజనులు సాగుచేస్తున్నారు. ఈ కొండచీపుర్లు తెలం గాణ, ఒడిశా రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వంటి పట్టణాలకు ఎక్కువగా సరఫరా అవుతాయి. వ్యాపారులు సీతంపేట, దోనుబాయి, మర్రిపాడు, కుసిమి, పూతికవలసలో జరిగే వారపు సంతలకు వేల సంఖ్యలో కొండచీపుర్లను కొనుగోలు చేసి తీసుకుపోతారు.
ఇంత వరకు బాగానే ఉన్న గత నెల రోజులుగా మైదాన ప్రాంత వ్యాపారులు కొండచీపుర్లను గిరిజన రైతుల నుంచి కొనుగోలు చేయడం మానేశారు. కొండచీపుర్లను తరలిస్తున్న వాహనాలపై అటవీశాఖ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేయడంతో పాటు రూ.లక్షల్లో అపరాధ రుసుం వసూలు చేస్తుండడంతో వ్యాపారులు హడలిపోతున్నారు. అంతేకాకుండా సీతంపేట ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న వన్‌ధన్ వికాశ కేంద్రాల(వీడీవీకే)ద్వారా కొనుగోలు చేసిన కొండచీపుర్లను సైతం రవాణా చేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. గత నెల రోజులుగా వారపు సంతలకు వేల సంఖ్యలో కొండచీ పుర్లను గిరిజన రైతులు తీసుకువస్తున్నా కొనుగోలు చేసేందుకు మైదాన వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేసేది లేక కొందరు వాటిని ఇంటికి తీసుకుపోతుండగా, మరికొందరు ఒక్కో కొండచీపురును రూ.20కే కారుచౌకగా అమ్ముకుంటున్నారు.
చోద్యం చూస్తున్న జీసీసీ
గిరిజన అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాల్సిన జీసీసీ చోద్యం చూస్తోంది. సీతంపేట ఏజెన్సీలో గిరిజన రైతులు పండించే అటవీ ఉత్పత్తుల్లో ప్రధానమైనవి కొండచీపుర్లు, నరమామిడి చెక్క, పసుపు, చింతపండు, నల్ల జీడిపిక్కలు, కుంకుడుకాయలు, తానికాయలు, చింతపిక్కలు, ఎండు ఉసిరి పప్పు, ముషిడి పిక్కలు, ఇండుగు పిక్కలు, కరక్కాయలు తదితర పంటలను జీసీసీ కొనుగోలు చేయాలి. అయితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆన్‌లైన్ టెండర్‌మెటల్ స్ర్కాప్ ట్రేడ్ కార్పొరేషన్(ఎంఎస్‌టీసీ) విధానం ద్వారా గిరిజన ఉత్పత్తులను విక్రయించాలని ఆదేశాలు వచ్చాయి.
అప్పటి నుంచి ఆన్‌లైన్ ద్వారా విక్రయాలు జరపడంతో ఆశించిన స్థాయిలో వ్యాపారం జర గడం లేదు. ఫలితంగా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయలేక జీసీసీ చేతులెత్తేసింది. ఇదే అదునుగా గడచిన కొన్నేళ్లుగా గిరిజన రైతుల శ్రమను మైదాన వ్యాపారులు దోచుకుంటున్నారు. మైదాన వ్యాపారుల అక్రమాలను అరికట్టాల్సిన జీసీసీ అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోపక్క జీసీసీ డీఎం స్థానికంగా ఉండకపోవడంతో గిరిజన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 2022-23 ఏడాదిలో 1.36లక్షల కొండచీపుర్లను జీసీసీ కొనుగోలు చేయగా, 2023-24లో కేవలం 9,436 కొండచీపుర్లను మాత్రమే కొనుగోలు చేసింది.
అటవీశాఖ ఎందుకిలా చేస్తోంది?
గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన అటవీ ఉత్పత్తులను జీసీసీ పర్మిట్‌తో మైదాన ప్రాంతాలకు వాహనాల్లో తరలిస్తే ఎవరూ అడ్డుచెప్పరు. కానీ, సీతంపేట ఏజెన్సీలో జీసీసీ సేవలు కొన్నేళ్లుగా స్తంభించాయి. దీంతో మైదాన ప్రాంత వ్యాపారులు జీసీసీ చేయలేని మార్కెటింగ్‌ను వారు చేసుకుంటూ లాభ పడుతున్నారు. దీనిని అరికట్టాలనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో అటవీశాఖ అధికారులు వారపు సంతల్లో వ్యాపారుల చేస్తున్న దందాపై నిఘా పెట్టారు.
దీనిలో భాగంగా కొండ చీపుర్లను మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న వాహనాలపై దాడులు చేసి అపరాధ రుసుం వసూలు చేశారు. అయితే, తమ ఉత్పత్తులను ఒకపక్క జీసీసీ కొనుగోలు చేయకపోతే, మరోపక్క వ్యాపారులకూ అమ్ముకోనీయకపోతే ఎలా బతకాలని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యను ఇటీవల ఐటీడీఏలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ శోభిక, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ దృష్టికి గిరిజన నాయకులు తీసుకువెళ్లారు. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం
మేము తీసుకువచ్చిన కొండచీపుర్లను వ్యాపారులు కొనుగోలు చేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుపడుతుంది. ఇటు జీసీసీ కొనుగోలు చేయక, అటు వ్యాపారులు కొనక ఇబ్బందులు పడుతున్నాం. ధరను తగ్గించి అమ్మినా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఐటీడీఏ ఆదుకోవాలి.
-సవర శ్రీకాంత్, పాండ్ర, సీతంపేట
జీసీసీ మాత్రమే కొనుగోలు చేయాలి
గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను జీసీసీ మాత్రమే కొనుగోలు, రవాణా చేయాలి. దళారులు, మైదాన ప్రాంత వ్యాపారులు కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేసే కేసులు నమోదు చేసి అపరాధ రుసుం వసూలు చేస్తాం. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జీసీసీ, అటవీశాఖల మద్య అగ్రిమెంట్ జరుగుతుంది. అగ్రిమెంట్ ఆధారంగా ప్రతి నెల జీసీసీ కొనుగోలు చేసే అటవీ ఉత్పత్తుల వివరాలను అటవీశాఖకు ఇవ్వాల్సి ఉంది. 2022-27 వరకు జీసీసీతో అగ్రిమెంట్ ఉంది. మొత్తంగా 24రకాల గిరిజన ఉత్పత్తులు కొనుగోలు, మార్కెటింగ్, రవాణా వంటి వివరాలు అగ్రిమెంట్‌లో నమోదు చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడే పరిస్థితి లేకుండా మేము ఈ చర్యలు తీసుకుంటున్నాం.
-వై.సంజయ్, సబ్ డీఎఫ్‌వో, పాలకొండ అటవీశాఖ రేంజ్