Kommareddy Pattabhiram : అక్టోబరు నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఏపీ
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:44 AM
వచ్చే అక్టోబరు నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు.

రాష్ట్రమంతటా వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్ యూనిట్లు
ఎక్కడా డంపింగ్ యార్డులు కనిపించకూడదు: పట్టాభిరామ్
విజయవాడ (భారతీనగర్), ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): వచ్చే అక్టోబరు నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా డంపింగ్ యార్డు కనిపించకూడదనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అనారోగ్యం బారినపడకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. డంపింగ్ యార్డు రహిత కార్యక్రమంలో భాగంగా.. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్‌ని నిల్వ చేయకుండా వేస్ట్ ప్రాసెస్ పద్ధతితో సంపద సృష్టిస్తున్నామన్నారు. ఏరోజు చెత్తను ఆరోజే వేస్ట్ ప్రాసెస్ పద్ధతి ద్వారా సంపదను సృష్టించవచ్చన్నారు. దీంతో ఎక్కడా డంపింగ్ యార్డులు ఉండవని చెప్పారు. ఇప్పుడున్న డంపింగ్ యార్డులను శుభ్రం చేసి.. పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. అక్టోబరు నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు.