Share News

Witness : వివేకా ఇంటి వాచ్‌మన్‌ రంగయ్య మృతి

ABN , Publish Date - Mar 06 , 2025 | 03:43 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆయన ఇంటి వాచ్‌మన్‌ రంగయ్య (70) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు.

Witness : వివేకా ఇంటి వాచ్‌మన్‌ రంగయ్య మృతి

  • అనారోగ్యంతో కడప రిమ్స్‌లో కన్నుమూత

  • వివేకా హత్య కేసులో ఇతడు ప్రత్యక్ష సాక్షి

  • ఆరేళ్లుగా సా..గుతున్న సీబీఐ విచారణ

  • అటు ఒక్కొక్కరుగా సాక్షులు,కీలక వ్యక్తుల మరణాలు

  • అనారోగ్యంతో కడప రిమ్స్‌లో కన్నుమూత.. వివేకా హత్య కేసులో ఇతడు ప్రత్యక్ష సాక్షి

కడప, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆయన ఇంటి వాచ్‌మన్‌ రంగయ్య (70) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. ఆయన చాలాకాలంగా వివేకా ఇంటి వాచ్‌మన్‌గా ఉంటున్నాడు. వివేకా 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు. ఆరోజు ఎర్రగంగిరెడ్డి వివేకా ఇంటి వెనుక వైపు ఉన్న వాకిలి నుంచి దస్తగిరిని, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌కుమార్‌ యాదవ్‌ను లోపలకు పిలుచుకెళ్లాడు. వివేకా హత్య అనంతరం వీరంతా బయటకు వచ్చారు. ఆ సమయంలో వీరిని రంగయ్య చూశాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని ఎర్రగంగిరెడ్డి బెదిరించాడు. సీబీఐ విచారణలో రంగయ్య ఈ విషయాలను వెల్లడించాడు. హత్య రోజు ఏం జరిగిందో జమ్మలమడుగు కోర్టులో పూసగుచ్చినట్లు రంగయ్య చెప్పాడు. హత్య కేసులో విచారణాధికారులకు చిక్కిన మొట్టమొదటి ఆధారం ఇతడే. కీలక సాక్షి కావడంతో సీబీఐ అతడి రక్షణకు ఇద్దరు పోలీసులను నియమించింది.


ఆగస్టు నుంచి ఆస్తమా

రంగయ్య గత ఆగస్టు నుంచి ఆస్తమాతో బాధపడుతున్నాడు. అతడికి కడప రిమ్స్‌లో చికిత్స చేయిస్తున్నారు. బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పోలీసులు కడప రిమ్స్‌కు తీసుకొచ్చారు. వచ్చిన కాసేపటికే ఆయన చనిపోయాడు. రంగయ్య భార్య సుశీల మీడియాతో మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 వరకు పోలీసులు తమను బాగా చూసుకున్నారని తెలిపింది. ‘రంగన్నకు నాకన్నా ఎక్కువగా సేవలు చేశారు. అయితే మూడు నెలల నుంచి పట్టించుకోవడం లేదు. నేను అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తున్నాను. ఈరోజు కూడా అంగన్వాడీకి వెళ్లాను. పోలీసులు ఫోన్‌చేసి మీ ఆయనకు ఆరోగ్యం బాగలేదంటూ త్వరగా రమ్మన్నారు. నేను వచ్చేసరికి అంబులెన్సులో కడప తీసుకెళ్లారు. ఆయన కడపలో చనిపోయారు. మూడు నెలలుగా పట్టించుకోని పోలీసులు ఈ రోజే పట్టించుకున్నారు’ అని చెప్పింది. రంగయ మృతిపై సెక్యూరిటీ సిబ్బంది.. సీబీఐ అధికారులకు, పులివెందుల డీఎస్పీకి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

ఒకరి తర్వాత మరొకరు..

వివేకా హత్య ఓ సంచలనమైతే. ఆ కేసులో సాక్షులు, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఒక్కరొక్కరుగా మృతిచెందడం మరింత సంచలనంగా మారుతోంది. ఆరోపణలు ఎదుర్కొన్న కసనూరుకు చెందిన శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసులో సాక్షిగా ఉన్న దేవిరెడ్డి అనుచరుడు.. కల్లూరు గంగాధర్‌రెడ్డి తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో 2022లో మృతిచెందారు.

  • వివేకా హత్యకు గురయ్యాక బ్యాండేజీ, వైద్యపరీక్షలు ఇతరత్రా అన్నీ జగన్‌ మామ ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రి సిబ్బంది చేశారు. గంగిరెడ్డి 2020లో మృతిచెందారు.

  • వివేకా హత్య జరిగిన రోజు ఆయన తలకు డాక్టర్‌ వైఎస్‌ అభిషేక్‌రెడ్డి బ్యాండేజీ వేశారు. ఆయనా ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఇప్పుడు రంగయ్య చనిపోయాడు.

Updated Date - Mar 06 , 2025 | 03:43 AM