CM Chandrababu: పోలవరం ప్రాజెక్టు సందర్శనకు..
ABN , Publish Date - Mar 27 , 2025 | 08:26 AM
జగన్ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును విస్మరించారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలో వచ్చాక పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజి కింద మరో రూ. 6,270 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈరోజు సీఎం చంద్రబాబు పోలవరం సందర్శనకు వస్తున్నారు.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) గురువారం పోలవరం ప్రాజెక్టు (Polavaram Dam)ను సందర్శించనున్నారు. ఉదయం హెలీకాప్టర్‌లో ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. రూ. 990 కోట్ల వ్యయంతో చేపట్టిన డయాఫ్రంవాల్ పనులు (Diaphragm Wall Works), ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ (Cofferdam)లను పరిశీలిస్తారు.సహాయపునరావాస కార్యక్రమాలపైనే ప్రత్యేకంగా సమీక్షిస్తారు. కాంట్రాక్ట్ సంస్థలు, ఇంజనీర్లతో సమీక్ష జరుపుతారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. 2014-19 కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే పోలవరం పనులు 72 శాతం పూర్తికాగా.. నిర్వాసితులకు రూ. 6వేల కోట్లు అందించారు. 2019-24 మధ్య సహాయపునరావాసాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కేంద్రం నిధులు ఇస్తేనే మీకు ఇస్తానంటూ జగన్ నిర్వాసితుల సమక్షంలోనే చేతులెత్తేసారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజి కింద మరో రూ. 6,270 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుండగా కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయి చెల్లింపులు జరపడంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తుంటుంది. ప్రాజెక్టుకు భూములిచ్చిన వారిని విస్మరిస్తుంటుంది. సహాయ పునరావాస కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యమివ్వదు.
Also Read..: కాశీ విశ్వనాథ దర్శనానికి ముందు సందర్శించాల్సిన ఆలయాలు
అయితే సీఎం చంద్రబాబు మాత్రం పోలవరం నిర్మాణానికి భూములిచ్చినవారిలో అత్యధికులు గిరిజనులే కావడంతో ప్రాజెక్టు పూర్తి అయ్యేలోపు వారికి సమాంతరంగా సహాయపునరావాసం కల్పించాల్సిందేనని తేల్చి చెప్పారు. అటు నిర్మాణ పనులు కొనసాగిస్తూనే సహాయ పునరావాస పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే ఆయన సారధ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వెయ్యి కోట్లను నేరుగా నిర్వాసితుల లబ్దిదారుల ఖాతాల్లో జమచేసింది. ఇప్పుడు 41.15 మీటర్లు కాంటూరులో భూ సేకరణ, సహాయ పునరావాసం, నగదు చెల్లింపుల కోసం రూ. 6,270 కోట్లు విడుదల చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
38,060 నిర్వాసిత కుటుంబాలకు గానూ ఇప్పటి వరకు 14,469 కుటుంబాలకు సహాయ పునరావాసం కల్పించారు. 2025 డిసెంబర్ లోపు ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ఆ లోపు మిగిలిన నిర్వాసిత కుటుంబాలకు సాయం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో రూ. 6,270 కోట్లను గరిష్టంగా మూడు విడతల్లో నేరుగా ఖాతాల్లో జమచేయాలని జలవనరుల శాఖ సంకల్పించింది. ఐదేళ్లు మూలన పడిన పోలవరం పనులను చంద్రబాబు ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటి వరకు 78.56 శాతం పూర్తయ్యాయి. 2019 నాటికి 72 మేర పూర్తి అయిన ప్రాజెక్టు పనులు తర్వాత ఐదేళ్లలో 3.84 శాతమే అయ్యాయి. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 2024 జూన్ నుంచి 2025 ఫిబ్రవరి నాటికి అంటే 8,9 నెలల్లోనే 2.78 శాతం పనులు పూర్తి అయ్యాయి. హెడ్ వర్క్ పనులు 76 శాతం, కుడి కాలవ పనులు 93 శాతం, భూ సేకరణ, సహాయ పునరావాసం 25 శాతం మేర జరిగాయి. ముఖ్యంగా డయాఫ్రంవాల్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి.
చంద్రబాబు పోలవరం టూర్ షెడ్యూల్..
సీఎం చంద్రబాబు గురువారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి, 10. 45 గంటలకు పోలవరం ప్రాజెక్ట్ సైట్ కు చేరుకుంటారు. హెలీప్యాడ్ వద్ద ఉన్న హిల్ వ్యూ పాయింట్ నుండి ప్రాజెక్ట్ పరిశీలిస్తారు. 11 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి డయాఫ్రం వాల్, గ్యాప్ వన్ , ఇతర పనులను నేరుగా పరిశీలిస్తారు. తరువాత మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాజెక్ట్ క్యాంప్ ఆఫీసులో అధికారులతో సమీక్ష జరుపుతారు. సాయంత్రం 3. 10 గంటలకు తిరిగి ఉండవల్లి బయలుదేరి వస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు మూడోసారి పోలవరంకు వస్తున్నారు. సీఎం రాక నేపథ్యంలో డ్రోన్ కెమెరాల ద్వారా అన్ని ప్రాంతాలపై నిఘా పెట్టారు. భద్రత నిమిత్తం ఇద్దరు అదనపు ఎస్పీలు, 14 మంది డీఎస్పీలు , 25 మంది సబ్ ఇన్స్పెక్టర్లతో కలిపి నాలుగు వందల మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భద్రాచలంలో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం
టూరిజం గురించి 30 ఏళ్ల క్రితమే చెప్పాను
For More AP News and Telugu News