YS Jagan: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
ABN , Publish Date - Feb 12 , 2025 | 06:07 PM
YS Jagan: మరో 25 నుంచి 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇన్ని బటన్లు నొక్కినా మనకే ఈ పరిస్థితి ఉంటే.. రేపు ఇచ్చిన మాటను గాలి కొదిలేసిన ఈ ప్రభుత్వంలో ఉన్న వారి పరిస్థితి ఏమిటి? అంటూ వైఎస్ జగన్ సందేహం వ్యక్తం చేశారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు.. ఇప్పుడు బాబు ష్కూరిటీ, మోసం గ్యారంటీ అయిందంటూ జగన్ ఎద్దేవా చేశారు.

అమరావతి, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అధికారంలో వచ్చిన తర్వాత ఆయన అమలు చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబు మోసం చేసి అధికారంలోకి వచ్చారు.. మరి ఈ వ్యక్తి చీటర్ కాదా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై 420 కేసు ఎందుకు పెట్టుకూడదంటూ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మొన్నటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. టీడీపీకి సభ్యులు లేక పోయినా దాడులు చేసి భయపెట్టారని.. అలాగే ప్రలోభ పెట్టారని ఆరోపించారు.
అన్యాయాలు చేసి గెలిచామంటూ గొప్పగా చెప్పుకుంటున్నారంటూ టీడీపీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. ఇంతకంటే నిస్సిగ్గుతనం ఉంటుందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. మన ప్రభుత్వంలో టీడీపీ రెండే రెండు మున్సిపాల్టీలు విజయం సాధించిందని.. అది కూడా మనం గట్టిగా తుమ్మి ఉంటే ఆవి కూడా వారికి వచ్చేవి కావన్నారు.
కానీ మనం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని.. ఆ ఫలితాలను గౌరవించామని చెప్పుకొచ్చారు. టీడీపీ తప్పుడు సంప్రదాయాలకు పాల్పడుతోందంటూ విమర్శించారు. మార్చి నాటికి స్థానిక సంస్థలకు నాలుగేళ్ల పదవీ కాలం ముగియబోతోందని చెప్పారు. తమ వాళ్లని పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ప్రయత్నిస్తారన్నారు.
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
రాబోయే రోజుల్లో మరిన్నిదొంగ కేసులు..
మన వాళ్లను భయపెట్టడానికి, లొంగ తీసుకోవడానికి, ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. రాబోయే రోజుల్లో మనపై మరిన్ని దొంగ కేసులు పెడతారు.. అరెస్టులు సైతం చేస్తారని పేర్కొన్నారు. అయితే ఎల్లకాలం పరిస్థితులు ఇలాగే ఉండిపోవని.. రానున్న మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తామని గుంటూరు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులకు మాజీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
జగన్ 1.0 ప్రభుత్వం..
ఇక 2019 -2024 మధ్య జగన్ 1.O ప్రభుత్వం నడిచిందన్నారు. ఆ సమయంలో ఎలాంటి లంచాలకు తావు లేకుండా రూ.2.71లక్షల కోట్ల డీబీటీ చేశామని గుర్తు చేశారు. అయితే కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినా.. ఖర్చులు పెరిగినా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. కనీవినీ ఎరుగని అభివృద్ధి చేశామని.. మనం చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉందని తెలిపారు.
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
మేనిఫెస్టో సైతం చెత్తబుట్టలో..
ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగరగొట్టారని.. మేనిఫెస్టోను సైతం చెత్తబుట్టలోకి విసిరేశారని మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం అబద్ధం, మోసమని ఆయన అభివర్ణించారు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. కానీ 10 శాతం ఓట్లు తగ్గాయన్నారు. అందుకు కారణం.. వారిలా తాను అబద్దాలు చెప్ప లేక పోవడమేనన్నారు.
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
జగన్ మరో 25 నుంచి 30 ఏళ్లు..
జగన్ మరో 25 నుంచి 30 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉంటాడని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇన్ని బటన్లు నొక్కినా మనకే ఈ పరిస్థితి ఉంటే.. రేపు ఇచ్చిన మాటను గాలి కొదిలేసిన ఈ ప్రభుత్వంలో ఉన్న వారి పరిస్థితి ఏమిటి? అని వైఎస్ జగన్ సందేహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని వాళ్లే అన్నారని గుర్తు చేశారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు...ఇప్పుడు బాబు ష్కూరిటీ, మోసం గ్యారంటీ అయిందంటూ ఎద్దేవా చేశారు.
ఏ పని జరగాలన్నా లంచాలు..
ఇసుక, లిక్కర్‌లో స్కామ్‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఏ పని జరగాలన్నా లంచాలు ఇవ్వాల్సిందేనని చెప్పారు. అలాగే యథేచ్చగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని మండిపడ్డారు. ప్రశ్నిస్తున్న వారిపై 111 సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రవాదులపై పెట్టే కేసులు పెట్టి వేధించి.. జైళ్లలో పెట్టారన్నారు.
రాబోయేది జగన్ 2.0 పాలన..
రాబోయేది జగన్ 2.O పాలన అని ఆయన జోస్యం చెప్పారు. చట్టవిరుద్ధంగా, అన్యాయాలు చేసేవారెవ్వరినీ వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. మన పరిపాలనలో రెండున్నర సంవత్సరాలు కోవిడ్ ఉందని గుర్తు చేసుకున్నారు. అందుకే కార్యకర్తలకు చేయాల్సింది చేయ లేకపోయామని వివరించారు. జగన్ 2.Oలో ప్రతి కార్యకర్తకు తాము తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. వాళ్ల ఇంటిలో పెద్దన్నగా వారి తోడుగా ఉంటానని ఈ సందర్భంగా వారికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
For AndhraPradesh News And Telugu News