Share News

Political Corruption: సర్కారీ భూములు స్వాహా

ABN , Publish Date - Mar 06 , 2025 | 04:33 AM

వైసీపీ బడా నేతలు గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు భూములను చెరపడితే.. వారి అనుచరులూ తమ స్థాయిలో కంటికి కనిపించిన ప్రభుత్వ భూములను సొంత ఖాతాలో వేసుకున్నారు.

Political Corruption: సర్కారీ భూములు స్వాహా

  • నాడు చెరపట్టిన వైసీసీ నేతలు

  • ఒక్క పీలేరులోనే 7 కేసుల్లో రూ.175 కోట్ల భూముల కబ్జా

  • ఇందులో 14 ఎకరాల రిజర్వ్‌ ఫారెస్ట్‌

  • అక్రమార్కులకు అధికారుల అండ

  • భూముల రికార్డులు తారుమారు

  • ప్రజల ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి

  • సమగ్ర విచారణకు రెవెన్యూ ఆదేశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వైసీపీ బడా నేతలు గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు భూములను చెరపడితే.. వారి అనుచరులూ తమ స్థాయిలో కంటికి కనిపించిన ప్రభుత్వ భూములను సొంత ఖాతాలో వేసుకున్నారు. ఇటు రీ సర్వే, అటు రికార్డుల స్వచ్ఛీకరణ పేరిట జరిగిన తంతును అడ్డం పెట్టుకొని వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తమ పేరిట మార్చుకున్నారు. కంచే చేను మేసిన చందంగా కొందరు రెవెన్యూ అధికారులు వైసీపీ అక్రమార్కులతో అంటకాగారు. వారు కోరుకున్న భూములను వారి పేరిట రికార్డుల్లోకి ఎక్కించారు. ఇందుకు ప్రతిఫలంగా నేతలు ఇచ్చిన సొమ్మును జేబులో వేసుకున్నారు. నాడు జగన్‌ సర్కారులో జరిగిన చీకటి దందా ఇప్పుడు ప్రజల ఫిర్యాదులతో బయటపడుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలం ఒక్క పీలేరు మండలంలోనే ఐదారుగురు వైసీపీ నేతలు కలిసి రూ.175 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను చెరపట్టిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. వారంతా నాటి ప్రభుత్వంలో కీలక మంత్రి పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరులే కావడం విశేషం.


ఫిర్యాదుల వెల్లువ

కూటమి ప్రభుత్వం వ చ్చాక ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైసీపీ నేతల భూదందాలపై ఫిర్యాదులు చేశారు. వాటిపై రెవె న్యూ శాఖ విచారణ చేయించింది. వైసీపీ నేతలు రెవెన్యూ ఇంటి దొంగలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్‌, ప్రభుత్వ భూములను చెరపట్టారు. విశాఖ లాంటి జిల్లాల్లో వైసీపీ నేతల అక్రమాలు బయటకు రాకుండా అధికార యంత్రాంగం అహర్నిశలు అడ్డుపడుతుండగా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం వరుసగా బయటపడుతున్నాయి. మదనపల్లె సబ్‌కలెక్టర్‌ ఆఫీసుకు ఎందుకు నిప్పు పెట్టాలనుకున్నారో, భౌతిక రికార్డులను ఎందుకు తగలబెట్టాలనుకున్నారో మరింత స్పష్టత వస్తోంది. పీలేరు మండలంలో వైసీపీ నేతల కబ్జాపై సమగ్ర విచారణ జరిపించాలని రె వెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాటిని పెద్దాయన కోసం రాయించుకున్నారా? లేక నేతలే హస్తగతం చేసుకున్నారా? అన్నది తేలాల్సి ఉంది. ఒక్క పీలేరు మండలంలోనే కేవలం 7 కేసుల్లో రూ.175 కోట్ల విలువైన భూములను కబ్జా చేస్తే... మిగిలిన 678 మండలాల్లో పరిస్థితి ఏమిటో? రెవెన్యూ విచారణలో పీలేరులో వెలుగు చూసిన అంశాలు..


అక్రమాలకు సాక్ష్యాలివే...

  • పీలేరులో సర్వే నంబర్‌ 72-2లో ప్రభుత్వ భూమి ఉంది. వైసీపీ నేత ఒకరు భూమిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేశారు. ఈ భూమి మార్కెట్‌ విలువ రూ.రెండు కోట్లపై మాటే.

  • సర్వే నంబర్‌ 564లో ప్రభుత్వ భూమి ఉంది. ఓ ప్రముఖ వైసీపీ నేత ఆ భూమిని చేజిక్కించుకొని అక్రమ నిర్మాణం చేశారు. ఈ భూమి విలువ రూ.3 కోట్లకు పైగా ఉంటుంది.

  • పీలేరు మండలం ఎర్రగుంటపల్లిలో సర్వే నంబర్‌ 741-1లో ప్రభుత్వ అనాధీన భూమి ఉంది. ఈ భూమి ఎన్‌హెచ్‌ -71 పక్కనే ఉంది. సమీపంలో హెరిటేజ్‌ మిల్క్‌ డెయిరీ కూడా ఉంది. మండల సర్వేయర్‌, ఇతర అధికారులు వైసీపీ నేతతో కుమ్మక్కయ్యారు. అంతే... ఆ భూమిని వైసీపీ నేత పేరిట 1బీ రిజిస్టర్‌లో నమోదు చేశారు. రీ సర్వే మొదలైన తర్వాత వైసీపీ నేత ఈ భూమిని తన ఖాతాలో వేసుకున్నారు. దీని విలువ రూ.10 కోట్ల పైమాటే.

  • పీలేరు మండలం గూడరేవుపుల్లిలో సర్వే నంబర్‌ 761-2లో 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రికార్డుల్లో ప్రభుత్వ అనాధీనం అని ఉంది. తహశీల్దార్‌ కార్యాలయంలోని డీకేటీ రిజిస్టర్‌ను తారుమారు చేసి ఆ భూమిని ఓ వైసీపీ నేత పేరిట రాశారు. ఇది జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-71 పక్కనే, పీలేరు టౌన్‌కు సమీపంలో ఉంది. అసైన్డ్‌ భూములకు ఫ్రీ హోల్డ్‌ హక్కులు ఇచ్చే సమయంలో వైసీపీ నేత ఈ భూమిని తన ఖాతాలో వేసుకున్నట్లుగా గుర్తించారు. ఆరు వరసల జాతీయ రహదారి పక్కనే ఉండటంతో ఇక్కడ ఎకరం ధర దాదాపు రూ.10 కోట్లు. రెండు ఎకరాల భూమి విలువ రూ.20 కోట్లపైనే ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.


  • పీలేరు మండలం గూడరేవుపల్లెలో సర్వే నంబర్‌ 780లో రెండు ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. ఇద్దరు వైసీపీ నేతలు ఈ రెండు ఎకరాలతో పాటు సర్వే నంబర్‌ 198లోని మరో రెండు ఎకరాల భూమిని తమ ఖాతాలో వేసుకున్నారు. నేతలు కబ్జా చేసిన ఈ భూమి విలువ రూ.20 కోట్ల పైమాటే.

  • పీలేరు మండలం గూడరేవుపల్లెలో సర్వే నంబర్‌ 774-2లో మూడు ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. ఎన్‌హెచ్‌-71 పక్కనే ఉంది. మాజీ మంత్రి పెద్దిరె డ్డి ప్రధాన అనుచరుడు ఈ భూమిని తన ఖా తాలో వేసుకున్నారు. ఈ భూమి విలువ రూ.30 కోట్లకు పైనేనని రెవెన్యూ శాఖ చెబుతోంది.

అటవీ భూమి కబ్జా

పీలేరు మండలం తలపులలో మురళీమోహన్‌రెడ్డి అనే వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరుడు. వైసీపీలో ఆయనదే హవా. ఆయన ఏకంగా రిజర్వ్‌ ఫారె్‌స్టపైనే కన్నేసి కబ్జా చేశారు. తలపులలో సర్వే నంబర్లు 1960, 2360-2, 2361-10, 2361-11లో 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మురళీమోహన్‌ రెడ్డి 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఫిర్యాదులు రాగా రెవెన్యూ శాఖ విచారించింది. ఆయన 14 ఎకరాలు ఆక్రమించినట్టు నిర్ధారణ అయ్యింది. ఇది రిజర్వ్‌ ఫారె్‌స్టలో భాగంగా ఉంది. ఇక్కడ సకల సదుపాయాలతో ఇంటి నిర్మాణం చేశారు. ఈ భూమి మార్కెట్‌ విలువ కనీసం రూ.90 కోట్లపైనే.

Updated Date - Mar 06 , 2025 | 04:33 AM