Notes to Coins: ఎక్కువమొత్తంలో చిల్లర కావాలా.. ఇలా చేస్తే ఉచితంగా కావాల్సినంత దొరుకుతుంది..
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:58 PM
నోట్లు ఇచ్చి నాణేలు తీసుకోవడానికి సాధారణంగా కొంత కమిషన్ తీసుకుంటారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలకు చిల్లర చాలా అవసరం. ఒక్క రూపాయి అదనంగా చెల్లించకుండా ఉచితంగా నాణేలు ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

డబ్బు విలువ నాణేనికి, నోటుకి ఒకేలా ఉంటుంది. పది రూపాయిల నోటుకు ఎంత విలువ ఉంటుందో.. పది రూపాయిల కాయిన్‌కు అదే విలువ ఉంటుంది. కానీ ఎక్కువమంది నోట్లు తమ వద్ద పెట్టుకోవడానికి ఇష్టపడతారు. కానీ చిల్లర దుకాణాలు, హోటల్స్, టీస్టాల్స్ వాళ్లకు చిల్లర ఎక్కువ అవసరం అవుతుంది. ఏవైనా పండుగలు, పుష్కరాలు లేదంటే ఇంట్లో ఏవైనా శుభకార్యాలు, పూజలు, వ్రతాలు చేసేటప్పుడు చిల్లర ఎక్కువమొత్తంలో అవసరం అవుతుంది. చిల్లర అవసరమైనప్పుడు వందకు పది రూపాయిల కమిషన్ ఇచ్చి ఎక్కువమంది తీసుకుంటారు. అలాగే టీస్టాల్స్, హోటల్స్, చిల్లర దుకాణాల వారు సైతం చిల్లరను కమిషన్‌కు కొనుక్కుంటారు. రోజూవారి చిల్లర అవసరమైన వాళ్లకు తక్కువ కమిషన్‌కే అందిస్తారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువమొత్తంలో చిల్లర అవసరమైనప్పుడు మార్కెట్‌లో లభించదు. ముఖ్యంగా పూజలు, పండుగల సమయంలో, పుష్కరాల సమయంలో చిల్లరకు భారీ డిమాండ్ ఉంటుంది. అలాంటి సమయంలో రూపాయి కమిషన్ చెల్లించకుండా నోట్లు ఇచ్చి చిల్లర ఎలా పొందాలో తెలుసుకుందాం.
రిజర్వుబ్యాంకులో..
నాణేలకు చిల్లర కావాలంటే బ్యాంకులో కూడా ఎక్కువ ఇవ్వరు. నోట్లు కావాలంటే పది రూపాయిలు, 20 రూపాయిలు లేదా 50, 100 రూపాయిల నోట్లు బ్యాంకులో ఇస్తారు. పూర్తిగా నాణేలు కావాలంటే రిజర్వుబ్యాంకులో తీసుకోవచ్చు. రిజర్వుబ్యాంకు ప్రాంతీయ కార్యాలయాల్లో ఉచితంగా అవసరమైనన్ని నాణేలను ఎలాంటి అదనపు రుసుము తీసుకోకుండా ఇస్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గరలో హైదరాబాద్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. రూపాయి మొదలు ఇరవై రూపాయిల నాణేం వరకు ఇక్కడ లభిస్తాయి. వెయ్యి రూపాయిల మొదలు ఎన్ని లక్షల వరకైనా చిల్లరను ఇస్తారు. దీనికోసం కొన్ని నిబంధనలు పాటించాలి. వాస్తవానికి రిజర్వుబ్యాంకు ప్రాంతీయ కార్యాలయాల్లో పూర్తి భద్రత ఉంటుంది. ఈక్రమంలో ఈ కార్యాలయంలోకి వెళ్లాలంటే పూర్తి తనిఖీ తర్వాత మాత్రమే లోపలకి అనుమతిస్తారు. చిల్లర కోసం ఎవరైనాసరే రిజర్వుబ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లొచ్చు. ఇక్కడ ఉచితంగా ఎలాంటి అదనపు రుసుము లేకుండా నాణేలు పొందవచ్చు.
గుర్తింపుకార్డు తప్పనిసరి
నోట్లు మార్చి నాణేలు కావాలనుకునేవాళ్లు తమ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాలి. వెళ్లగానే గేటు బయట భద్రతా సిబ్బంది ఏ పని కోసం వచ్చారని అడుగుతారు. చిల్లర కోసం అని చెబితే.. ఆధార్ కార్డు చూపించమని అడుగుతారు. కార్డు మీదేనని నిర్ధారించుకున్న తర్వాత గేటు లోపలకి అనుమతిస్తారు. లోపలకి ప్రవేశించగానే భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తారు. ఎలాంటి పెద్ద పెద్ద బ్యాగులను లోపలకి అనుమతించరు. గేటు బయట మాత్రమే బ్యాగులను భద్రపర్చుకోవాలి. మీవద్ద ఎలాంటి నిషేధిత వస్తువులు లేవని నిర్థారించుకున్న తర్వాత కార్యాలయంలోనికి అనుమతిస్తారు. అదే సమయంలో మొబైల్ ఫోన్‌ను స్విచ్చాప్ చేయాల్సి ఉంటుంది. సైలెంట్‌లో పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో ఫోన్ స్విచ్ఛాప్ చేయాలని భద్రతా సిబ్బంది అభ్యర్థిస్తారు. ఆ తర్వాత లోపల చిల్లర కోసం మీరు ఒక దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్‌ను ఉచితంగా ఇస్తారు. ఈకార్డు పొందేందుకు మీ ఆధార్ కార్డు చూపించాలి. మీ వివరాలు నమోదుచేసుకుని మీకు అవసరమైన అప్లికేషన్ ఇస్తారు. మీకు కేటాయించిన సీట్లో కూర్చుని దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు నిర్దేశించిన కౌంటర్‌లో దరఖాస్తుతో పాటు నోట్లు ఇస్తే.. అంతే మొత్తంలో నాణేలు అందిస్తారు. మీకు ఏ విధమైన నాణేలు కావాలో అప్లికేషన్‌లో పొందుపర్చాలి. ఇలా చేస్తే రూపాయి అదనపు ఖర్చు లేకుండా మీకు అవసరమైన మొత్తంలో చిల్లర నాణేలు పొందవచ్చు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here