Crime News: అమ్మో.. 20 ఏళ్లుగా తాళం వేసి ఉన్న ఆ ఇంట్లో..
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:41 PM
ఓ ఇల్లు 20 ఏళ్లుగా తాళం వేసి ఉంది. అయితే, ఆ ఇంటి వద్ద ఆందోళన జరుగుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేసేందుకు ఆ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Kerala: కొచ్చిలోని చొట్టనిక్కరలోని ఎరువేలి ప్యాలెస్ స్క్వేర్ సమీపంలో 12 ఎకరాల స్థలంలో ఓ పెద్ద ఇల్లు ఉంది. మంగళస్సేరి ఫిలిప్ జాన్ అనే వైద్యుడికి చెందిన ఆస్తి. అయితే, 20 ఏళ్లుగా తాళం వేసి ఉన్న ఆ ఇంటి వద్ద సంఘ వ్యతిరేకుల వల్ల అలజడులు జరుగుతున్నాయని స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. ఆ ఇంట్లోకి వెళ్లిన పోలీసులకు ఓ రిఫ్రిజిరేటర్ కనిపించింది. అందులో ఒక కవర్ ఉంది. అయితే, దానిలో ఏముందా అని తెరిచి చూసిన పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
రిఫ్రిజిరేటర్‌లో..
రిఫ్రిజిరేటర్ లోని ఆ కవర్‌లో ఒక అస్థిపంజరం, పుర్రె కనిపించాయి. వెన్నెముకతో సహా ఎముకలు చెక్కుచెదరకుండా కనిపించాయి. దానిని చూసిన పోలీసులు ఖంగుతున్నారు. కాసేపు తర్వాత ఆ పుర్రె మనిషిదేనని నిర్ధారించారు. ప్రాథమికంగా ఆ పుర్రె చాలా సంవత్సరాల నాటిదని అభిప్రాయపడుతున్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు ఈ విషయంపై పూర్తిగా విచారణ జరుపుతున్నారు. పుర్రెను తీసుకొచ్చి ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌లో ఎవరు ఉంచారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని వైద్యుడిని కూడా సంప్రదించారు. బయటనుండి ఎవరు అక్కడికి వెళ్లకుండా ఉండేలా ఆ ప్రాంగణాన్ని పోలీసులు సీల్ చేశారు.
సంఘటనపై ఫోరెన్సిక్ నిపుణులకు సమాచారం అందించారు. అయితే, ఆ పుర్రె ఎవరిది? యజమాని 20 ఏళ్లుగా ఆ ఇంటిని ఎందుకు పట్టించుకోలేదు? తనే ఆ హత్యా చేశారా? లేదా వేరే ఎవరైనా హత్య చేసి ఆ ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌లో ఉంచారా? ఆ హత్య ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అనే విషయాలపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.