Share News

Ampasayya Naveen : ‘అంపశయ్య’ను టెక్నిక్‌ కోసం రాయలేదు

ABN , Publish Date - Jan 13 , 2025 | 06:10 AM

నాటి నూతన సహస్రాబ్ది సందర్భంలో వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో- వెలువడిన వేలాది గ్రంథాల్లోంచి వంద అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రచురించాలని సంకల్పించి అబ్బూరి ఛాయాదేవి...

Ampasayya Naveen : ‘అంపశయ్య’ను టెక్నిక్‌ కోసం రాయలేదు

  • నవలా శిల్పం

  • అంపశయ్య నవీన్‌

నాటి నూతన సహస్రాబ్ది సందర్భంలో వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో- వెలువడిన వేలాది గ్రంథాల్లోంచి వంద అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రచురించాలని సంకల్పించి అబ్బూరి ఛాయాదేవి, బి.ఎస్.రాములు, చందు సుబ్బారావు, చేకూరి రామారావు, కేతు విశ్వనాథరెడ్డి, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, వేగుంట మోహనప్రసాద్ వంటి హేమాహేమీలతో ఒక కమిటీని ఏర్పరచి వాళ్ళ ఏకీకృత అభిప్రాయంతో వంద అత్యుత్తమ గ్రంథాలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రకటించినపుడు ‘అంపశయ్య’ నవల 49వ స్థానంలో నిలిచింది. మొదటి నవలతోనే అంతటి అసాధారణ గౌరవాన్ని పొంది, ఆ నవల పేరునే ఇంటిపేరుగా చేసుకుని, తర్వాత మరెన్నో నవలలతో విశిష్ట నవలాకారుడిగా తెలుగు సాహిత్యంలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ‘అంపశయ్య’ నవీన్‌తో ఆయన నవలల గురించి జరిపిన సంభాషణ ఇది.

  • మీ నవలల్లో ‘అంపశయ్య’కు ఎలాంటి స్థానం ఇస్తారు?

నేను రాసిన 35 నవలల్లో ఈ నవలకే మొదటి స్థానం ఇస్తాను. ఆరంభ యౌవనంలో అడుగుపెట్టిన యువతీయువకుల మైండ్స్‌ని ఈ నవల శోధించినంత నిశితంగా, లోతుగా, నిర్భయంగా శోధించిన నవల తెలుగులో మరొకటి లేదనే నా అభిప్రాయం.

  • ‘అంపశయ్య’ను తెలుగులో చైతన్య స్రవంతి శైలిలో రాయబడిన మొదటి నవలగా పేర్కొంటారు. అదే శైలిలో రాసిన జేమ్స్‌ జాయ్స్‌, వర్జీనియా వూల్ఫ్ వంటి పాశ్చాత్య రచయితల ప్రభావాలు మీపై ఉన్నాయా?

‘అంపశయ్య’ రాయడం సగం పూర్తి చేసేంతవరకు నాకు ‘చైతన్య స్రవంతి’ అనేది ఒకటుందని, ఆ శిల్పంతో జేమ్స్‌ జాయిస్, వర్జీనియా వుల్ఫ్ రచనలు చేశారని తెలియనే తెలియదు. నేను నల్గొండ కాలేజ్‌లో పనిచేస్తున్న రోజుల్లో సీతారామారావు అనే కామర్స్ లెక్చరర్ ఉండేవాడు. ఆయనకు సాహిత్యం మీద చాలా ఇంట్రస్ట్ ఉండేది. మేమంతా ఆయన చుట్టూ చేరి ఆయన చెప్పే సాహిత్యానికి సంబంధించిన కబుర్లని ఆసక్తిగా వింటూండేవాళ్ళం. నాకప్పుడు నేను రాస్తున్న ఈ నవల గురించి ఈయన ఏమంటాడో చూద్దామనిపించి సగం రాసిన నవలను అతనికిచ్చాను. దాన్ని చదివి ‘‘మీరు కొత్త టెక్నిక్‌తో రాస్తున్నారు. దీన్ని ‘చైతన్య స్రవంతి’ లేదా ‘స్ట్రీమ్‌ ఆఫ్‌ కాన్షస్‌నెస్‌’ అంటారని మీకు తెలుసా’’ అన్నాడు. తెలియదన్నాను.


‘‘ఇదే టెక్నిక్‌తో జేమ్స్‌ జాయిస్ ‘యులిసెస్‌’ అనే గొప్ప నవలను రాశాడు. దీన్ని మన కాలేజ్‌కి నేనే తెప్పించాను. ఓ పట్టాన అర్థం కాదనుకోండి. దానికి స్టూవర్ట్ గిల్బర్ట్ అనే ఆయన ‘గైడ్‌ టు యులిసెస్‌’ రాశాడు. దాన్ని పక్కన పెట్టుకుని చదివితే అర్థమౌతుంది’’ అన్నాడు. లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకాలు చదవబోయాను. కొంచెం అర్థమై కొంచెం అర్థం కాలేదు. నేను అంపశయ్యలో అంత సంక్లిష్టమైన టెక్నిక్‌ను ఉపయోగించ లేదు. టెక్నిక్‌ కోసం నేనా నవలను రాయలేదు. నాలో కలిగే ఫీలింగ్స్‌ని దాపరికం లేకుండా యధాతథంగా రాయాలని అనుకున్నానంతే.

  • వందకు పైగా కథలు రాసినప్పటికీ మీకు నవలాకారునిగానే గుర్తింపు లభించింది. కారణం ఏమై ఉంటుంది?

నన్ను నవలాకారునిగానే చూడడానికి చాలా కారణాలున్నాయి. కొందరు కావాలని కుట్రపూరితంగా నా కథల్ని అణచి వెయ్యాలని చూశారు. అయినా కొందరు సహృదయులు– ఆర్.ఎస్. సుదర్శనం, మధురాంతకం రాజారాం, మునిపల్లె రాజు లాంటి వాళ్ళు నవలాకారుడిగా నువ్వెంత గొప్పవాడివో కథకుడిగా కూడా అంతే గొప్పవాడివని ప్రశంసించారు. మన కొందరు విమర్శకులకు ఉద్యమాలను గురించి రాసిన కథలు మాత్రమే అర్థమౌతాయి గాని మానసిక సమస్యలను గూర్చి మనో విశ్లేషణే ప్రధానంగా రాసిన నా కథలు అర్థం కావు. అర్థమైనా పట్టించుకోరు.

  • మీ సుదీర్ఘ సాహిత్య జీవితంలో కవిత్వమే రాయలేదు. ఎందుకు?

ప్రారంభ దశలో కవిత్వం రాశాను. ఛందోబద్ధంగా రాసిన తేటగీతుల్ని హైస్కూల్‌లో మాకు తెలుగు చెప్పిన విశ్వనాథ వెంకటేశ్వర్లు గారికి చూపించాను (ఆయన స్వయంగా విశ్వనాథ సత్యనారాయణ తమ్ముడు). నేను రాసిన కొన్ని చిన్న కథల్ని కూడా ఆయనకు చూపించాను. ‘‘నువ్వు రాసిన పద్యాలకంటే నీ కథలే బాగున్నాయిరా’’ అన్నాడు. ఇంకొక విషయమేమిటంటే ఆరోజుల్లో ఇంకా వచన కవిత్వం ప్రాచుర్యంలోకి రాలేదు. ఛందోబద్ధంగానే కవిత్వం రాయాలి. నాకు ఆ గణాలు, యతిప్రాసలు పాటిస్తూ రాయడం సర్కస్ ఫీట్‌లా అనిపించేది. బహుశా అప్పటికి వచన కవిత్వం బహుళ ప్రాచుర్యంలోకి వచ్చివుంటే నేను కూడా కవిత్వం రాసేవాడినేమో.


  • ఒకే ఘటనను కొందరు వ్యక్తులు తమ తమ భిన్నమైన కోణాల్లో అర్థం చేసుకుని భిన్నమైన అవగాహనతో ఎట్లా ప్రతిస్పందిస్తారో చూపిస్తుంది అకిరా కురసోవా ‘రషోమన్‌’ సినిమా. ఇదే శైలిలో ‘దృక్కోణాలు’ నవలను మీరు రాశారు. ఈ ప్రయోగాన్ని పాఠకులు ఎట్లా స్వీకరించారు?

మంచి సినిమాలకూ, సాహిత్యానికీ చాలా సన్నిహితమైన సంబంధం ఉంటుంది. అకిరా కురసోవా ‘రషోమన్‌’ నన్ను చాలా ఆలోచింపజేసింది. సంఘటన ఒకటే ఐనా దాన్ని ఒక్కొక్కరం ఒక్కొక్క విధంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళకు నచ్చిన విధంగా అవగాహన చేసుకుంటారు. నిజానిజాలతో పనిలేదు. ఆ సంఘటన నుండి వాళ్ళకిష్టమైన కన్‌క్లూజన్స్‌ను రాబట్టుకోవడమే వాళ్ళకు కావాలి. మనిషిలోని ఈ మానసిక స్థితినిబట్టి, ఏ కన్‌క్లూజన్ అతనికి తృప్తినిస్తుందో అన్నదాన్నిబట్టి మనిషిలోని ఆలోచనా విధానం ఉంటుంది. అందరి వ్యక్తుల కన్‌క్లూజన్స్ ఒకే విధంగా ఉండవు. మనిషిలోని ఈ అవగాహనా పద్ధతినిబట్టి వాళ్ళ దృక్కోణాలు మారుతూం టాయి. ఈ అంశాన్ని హైలైట్ చెయ్యడానికే నేను ‘దృక్కోణాలు’ నవలను రాశాను. కొందరు పాఠకులు నవల ప్రధాన సంఘటన ‘రేప్’ అయ్యుండకపోతే ఇంకా బావుండేదన్నారు.

  • 1975 ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతిసాహసోపేత వస్తువుతో ‘చీకటి రోజులు’ నవలను రాసి ప్రకటించారు. అప్పటి స్థితిగతుల గురించి చెప్పండి?

1975 ఎమర్జెన్సీని సమయంలో నేను ‘అరసం’ సంస్థలో ఉన్నాను. అరసం సీపీఐకి అనుబంధ సంస్థ. సీపీఐ ఎమర్జెన్సీని సపోర్ట్ చేసింది. నన్ను అరెస్ట్ చేయాలని చూశారనీ, కాని అరసం సీపీఐ అనుబంధ సంస్థ కాబట్టి అరెస్ట్ చేయొద్దనుకున్నామని నాకు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు. అప్పుడు నా మిత్రుడు తిరుపతయ్య జమ్మి కుంటలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ‘విరసం’ సంస్థతో చాలా కొద్ది చినచిన్న సంబంధాలున్నాయని పోలీస్‌వాళ్ళు కనిపెట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయనను ఏ పోలీస్ స్టేషన్‌లోనో జైలులోనో నిర్బంధించలేదు. కరీంనగర్ దగ్గరున్న ఒక ఊరి పోలీస్ క్యాంప్‌లో పెట్టారు. 24 రోజుల తర్వాత విడుదల చేశారు.


పోలీస్‌ క్యాంప్‌ నుండి విడుదలయ్యాక నేను జమ్మికుంటకు వెళ్ళి ఆయనను కలిశాను. ఇన్ని రోజులు ఆ పోలీస్‌క్యాంప్‌లో ఏం జరిగిందో, ఒక్కొక్క ఫోలీస్ ఆఫీసర్ ఎలా ప్రవర్తించాడో చెప్పాడు నాకు. ‘‘దీన్ని బ్యాక్‌గ్రౌండ్‌గా తీసుకుని ఒక నవల రాయి తిరుపతయ్యా’’ అన్నాను. దానికాయన ‘‘రాస్తే నన్ను పోలీసులు పట్టుకుపోవడం ఖాయం’’ అని భయపడ్డాడు. అప్పుడిక నేనే రాద్దామని నిర్ణయించుకున్నాను. ఆ రోజుల్లోనే ఒకసారి ‘ఈనాడు’ ఆఫీస్‌కు వెళ్ళి చలసాని ప్రసాదరావును కలిశాను. ఆయనకు ఈ ఆలోచన చెబితే– ఒక్క తిరుపతయ్య అనుభవాలే కాదు,- ఆ రోజుల్లో మన దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్న అట్రాసిటీస్‌ని కవర్ చేస్తూ రాస్తే బాగుంటుందనీ, ఉన్నది ఉన్నదున్నట్టుగా కాకుండా కొంత కల్పనను కూడా జోడించి నవల పరిధిని విసృతం చేస్తే మంచి వర్క్ అవుతుందని చెప్పాడు. ఆయన చెప్పింది బాగానే ఉందనుకుని– కేరళకు చెందిన రాజన్‌ను మాయం చెయ్యడం, స్నేహలతారెడ్డిని పోలీస్‌ క్యాంప్‌లో పెట్టి హింసించడం, నరసింహులు అనే కేడీ కథ.. ఇవన్నీ కలిపి ఆ నవలను డైరీ రూపంలో రాశాను. ఎందుకోగాని దానికి రావలసిన గుర్తింపు రాలేదు. మొత్తం భారతదే

Updated Date - Jan 13 , 2025 | 06:11 AM