Non-vegetarian food: ఆదివారం రోజే చికెన్, మటన్ ఎక్కువగా ఎందుకు తింటారంటే..
ABN , Publish Date - Jan 05 , 2025 | 07:19 AM
ప్రపంచవ్యాప్తంగా మాంసాహార ప్రియులే ఎక్కువగా ఉంటారు. శాఖాహారం కన్నా మాంసాహారాన్నే చాలా మంది ఇష్టంగా ఆరగిస్తుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ లేదా మటన్ తెచ్చుకోవాల్సిందే.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మాంసాహార ప్రియులే ఎక్కువగా ఉంటారు. శాఖాహారం కన్నా మాంసాహారాన్నే చాలా మంది ఇష్టంగా ఆరగిస్తుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ లేదా మటన్ తెచ్చుకోవాల్సిందే. అమ్మ లేదా భార్యతో రుచికరంగా వండించుకుని తినాల్సిందే. ఇటీవల కాలంలో హోటళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత ప్రతి రోజూ నాన్ వెజ్ తినే వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఒక్క క్లిక్‌తో బిర్యానీ ఇంటి ముందుకే రావడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ పెట్టుకుని తినేస్తున్నారు. అయినా ఆదివారం రోజును అంతా ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఆ రోజు ఇంట్లో కచ్చితంగా నాన్ వెజ్ ఉడకాల్సిందే. లేదంటే ఏదో వెలితిగా అనిపిస్తుంటుంది. అయితే ఆదివారం రోజు కచ్చితంగా నాన్ వెజ్ తినాల్సిందే అనే సంప్రదాయం ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందా..
ఆదివారమే ఎందుకంటే..
మాంసాహార ప్రియులకు ఆదివారం ప్రత్యేకమైన రోజు. చాలా దేశాల ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు స్థానిక చట్టాల ప్రకారం తమ ఉద్యోగులకు వారానికి ఓ రోజు ఇవ్వాల్సిన సెలవు దినాన్ని ఆదివారంగా ఎంచుకున్నారు. వారం మెుత్తం కష్టపడి పని చేసిన ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడి, శరీర అలసటతో ఉంటారు. ఆ ఒక్కరోజు మాత్రం కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతుంటారు. అయితే మానవజాతి ఆవిర్భావం నుంచి నాన్ వెజ్ తినడానికే మనిషి ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. అయితే ఆదివారం రోజున తమ కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిసే సమయంలో మాంసాహారం ఉంటే ఇంక ఆ మజానే వేరుగా ఉంటుంది. అందుకే ఆదివారం రోజున చికెన్, మటన్, చేప వంటి మాంసాహారాలు తినేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాగే పిల్లలు కూడా పాఠశాలలు, కళాశాలలకు వెళ్తూ వారం మెుత్తం బిజీబిజీగా ఉంటారు. ఆ ఒక్కరోజే ఇంటి వద్ద ఉంటారు. అందుకే ఈ రోజున నాన్ వెజ్ తినేందుకు ఎక్కువగా మంది మెుగ్గు చూపుతుంటారు.
ఈ సంప్రదాయమే కాలక్రమేనా సంస్కృతిగా మారిపోయింది. ఆదివారం మాంసాహారం తినని కుటుంబం అంటూ ఉండదు. దాదాపు ప్రతిఒక్కరూ ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు ఆదివారాన్ని ప్రత్యేకంగా చూస్తారు. ఆ రోజు నాన్ వెజ్ తీసుకురాకపోతే పిల్లలు పెద్ద యుద్ధమే చేస్తుంటారు. దీంతో ఆదివారం నాన్ వెజ్ తినడం తప్పని సరిగా మారిపోయింది. అందుకే ఆదివారం నాడు చికెన్, మటన్ షాపుల ముందు ప్రజలు పెద్దఎత్తున బారులు తీరుతుంటారు.