Paetongtarn Shinawatra: ఆ ప్రధాని వద్ద 200 డిజైనర్ బ్యాగులు, 75 లగ్జరీ వాచ్‌లు
ABN , Publish Date - Jan 03 , 2025 | 05:43 PM
పేటోంగ్టార్న్ షినవత్రా తనకు 400 మిలియన్ డాలర్లు సంపద ఉన్నట్టు జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్‌కు వివరాలు సమర్పించారు.
బ్యాంకాక్: థాయ్‌లాండ్ (Thailand) ప్రధానిగా గత ఏడాది ఆగస్టులో పదవీ బాధ్యతలు చేపట్టిన పేటోంగ్టార్న్ షినవత్రా (Paetongtarn Shinawatra) తాజాగా తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. 400 మిలియన్ డాలర్లు సంపద ఉన్నట్టు జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్ (NACC)కి వివరాలు సమర్పించారు. ఇందులో 2 మిలియన్ డాలర్లు విలువచేసే 200 డిజైనర్ బ్యాగులు, 5 మిలియన్ డాలర్లు విలువున్న 75 లగ్జరీ వాచ్‌లు ఉన్నట్టు తెలిపారు.
కాగా, 400 మిలియన్ డాలర్ల విలువ థాయ్ కరెన్సీలో 13.8 బాత్‌గా ఉంది. ఇందులో 11 బిలియన్ బాత్‌ను పెట్టుబడులుగా, 5 బిలియన్ బాత్‌ను అప్పుగా, ఒక బిలియన్ బాట్ డిపాజిట్లు, నగదు రూపంలో చూపించారు. వీటితో పాటు లండన్, జపాన్‌లో ఆస్తులున్నట్టు చెప్పారు.
పేటోంగ్టార్న్ షినవత్రా తండ్రి తక్సిన్ షినవ్రతా దేశ మాజీ ప్రధానిగా సేవలందించారు. మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌కు ఒకప్పుడు యజమానిగా ఉన్న తక్సిన్ ఆస్తుల విలువ 2.1 బిలియన్ డాలర్లని, థాయ్‌లాండ్‌లోని 10 మంది సంపన్నులలో ఒకరని 'ఫోబ్స్' తెలిపింది. షిన్ కార్ప్ టెలికమ్యూనికేషన్ ఎంపైర్‌గా ఉంటూ పెద్దఎత్తున ఆస్తులు సంపాదించి అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో ప్రధాని పదవిని చేపట్టినప్పటికీ 2006లో సైనిక తిరుగుబాటు కారణంగా పదవిని కోల్పోయారు. కాగా, పెటోంగార్న్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని గత ఆగస్టులో పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో పాలక ఫ్యూ థాయి పార్టీ నేతలు, సంకీర్ణ భాగస్వాములు బలపరిచారు. అనూకూలంగా 319, వ్యతిరేకంగా 145 ఓట్లు వచ్చాయి. దీంతో 37 ఏళ్ల వయస్సులోనే దేశ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన ఘనతను ఆమె దక్కించుకున్నారు. థాయ్‌కు రెండో మహిళా ప్రధాని కూడా ఆమెనే కావడం విశేషం.