మయన్మార్, థాయ్‌లాండ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా
ABN , Publish Date - Mar 28 , 2025 | 03:36 PM
Earthquake In Myanmar And Thailand: మయన్మార్ దేశంలో వచ్చిన రెండు వరుస భూకంపాల కారణంగా థాయ్‌లాండ్‌లో ఓ ఎత్తైన భవనం కుప్పకూలిపోయింది. ఇండియా, బంగ్లాదేశ్, చైనాల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మయన్మార్‌లో శుక్రవారం వరుసగా రెండు భారీ భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే. ఆ భూకంపాల తీవ్రత రెక్టార్ స్కేల్‌పై 7.7, 6.4గా నమోదైంది. భూకంపాల కారణంగా ఓ మసీదు పాక్షికంగా కూలిపోయింది. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. 91 ఏళ్ల చరిత్ర కలిగిన ఐకానిక్ ఏవా బ్రిడ్జ్ కూడా నదిలో కుప్పకూలిపోయింది. ఈ భూకంపాలు బ్యాంకాక్‌లోనూ అలజడి సృష్టించాయి. భూప్రకంపనల కారణంగా ఛాతుచక్ జిల్లాలోని ఓ ఎత్తైన భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు బలయ్యారు. మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. భూకంపం భయంతో ప్రజలు ఇళ్లను విడిచి బయటకు పరుగులు తీశారు.
మయన్మార్, థాయ్‌లాండ్‌కు అండగా మోదీ
మయన్మార్, థాయ్‌లాండ్ భూకంపాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రెండు దేశాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. ‘ భూకంపం కారణంగా మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో ఏర్పడ్డ పరిస్థితులను చూస్తుంటే బాధగా ఉంది. అక్కడి వారందరూ క్షేమంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. భారత్ మీకు అండగా ఉంటుంది. అవసరమైన సాయం చేస్తుంది. మా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాను. మయన్మార్, థాయ్‌లాండ్ ప్రభుత్వాలతో టచ్‌లో ఉండమని మా విదేశీ వ్యవహారాల శాఖకు కూడా చెప్పాను’ అని అన్నారు.
మయన్మార్‌లో వచ్చిన భారీ భూకంపాలు కేవలం బ్యాంకాక్‌లో మాత్రమే కాదు.. ఇండియా, బంగ్లాదేశ్, చైనాల్లోనూ అలజడి సృష్టించాయి. పలుచోట్ల భూప్రకంపనలు వచ్చాయి. ఇండియాలోని కోల్‌కతా, మేఘాలాయతో పలు ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి. చైనాలోని సౌత్‌ఈస్ట్ యున్నాన్ ప్రావిన్స్‌లో కూడా భూప్రకంపనలు వచ్చాయి. ఈ భూప్రకంపనల కారణంగా మూడు దేశాల్లో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించలేదు. కాగా, భూకంపాల తీవ్రత ఎంటో కళ్లకు కట్టే పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రాణ భయంతో జనం పరుగులు పెడుతున్న తీరు, వాళ్ల ఏడుపులు చూసే వాళ్ల కళ్లు తడి అయ్యేలా చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
Earthquake In Myanmar: మయన్మార్‌లో భూకంపం.. థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ