Share News

కరీబియన్‌ దీవుల్లో భారత సంతతి వైద్య విద్యార్థిని అదృశ్యం

ABN , Publish Date - Mar 11 , 2025 | 05:38 AM

కరీబియన్‌ దీవుల్లో భారత సంతతి విద్యార్థిని, తెలుగు మూలాలు ఉన్న సుదీక్షా కోనంకి(20) అదృశ్యమయ్యారు. అమెరికాలోని వర్జీనియా లౌడౌన్‌ కౌంటీలో తన తల్లిదండ్రులు సుబ్బారాయుడు, శ్రీదేవితో కలిసి సుదీక్ష నివసిస్తున్నారు.

కరీబియన్‌ దీవుల్లో భారత సంతతి వైద్య విద్యార్థిని అదృశ్యం

న్యూయార్క్‌, మార్చి 10: కరీబియన్‌ దీవుల్లో భారత సంతతి విద్యార్థిని, తెలుగు మూలాలు ఉన్న సుదీక్షా కోనంకి(20) అదృశ్యమయ్యారు. అమెరికాలోని వర్జీనియా లౌడౌన్‌ కౌంటీలో తన తల్లిదండ్రులు సుబ్బారాయుడు, శ్రీదేవితో కలిసి సుదీక్ష నివసిస్తున్నారు. పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో మెడిసిన్‌ చదువుతున్న సుదీక్ష, విశ్వవిద్యాలయం సెలవులు ప్రకటించడంతో స్నేహితులతో కలిసి మార్చి 3న డొమినికన్‌ రిపబ్లిక్‌ రిసార్ట్‌ టౌన్‌ అయిన పుంటాకానాకు వెళ్లారు. సుదీక్ష, ఆమె స్నేహితులు అక్కడి హోటల్‌లో బస చేశారు. మార్చి 6న సుదీక్ష తన స్నేహితులతో కలిసి అక్కడి బీచ్‌కు వెళ్లారు. సుదీక్ష, ఆమె స్నేహితుల్లో ఒకరు బీచ్‌లోనే ఉండిపోగా మిగతావారు అక్కడి నుంచి తిరిగి హోటల్‌కు వెళ్లిపోయారు. బీచ్‌లో నడుస్తుండగా సుదీక్ష కనిపించకుండా పోయారని, ఆ రోజు ఆమె చివరిసారిగా 4:15 నిమిషాలకు కనిపించారని స్థానికులు చెప్పారు.


నాలుగు రోజులుగా ఆమె ఆచూకీ లభించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈత కొట్టేందుకు సుదీక్ష సముద్రంలోకి దిగివుంటారని, ఆ క్రమంలో భారీ అల తాకిడికి ఆమె గల్లంతై ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. సుదీక్ష ఆచూకీ కోసం సివిల్‌ డిఫెన్స్‌, నేవీ సహా పోలీసు శాఖ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్లు, డ్రోన్లనూ వినియోగిస్తున్నారు. డొమినికన్‌ రిపబ్లిక్‌లో దోపిడీలు, కిడ్నా్‌పలు, హత్యలు తరచుగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో తమ కూతురును ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉంటారని, ఆ కోణంలోనూ దర్యాప్తు చేయాలని సుదీక్ష తల్లిదండ్రులు అధికారులను కోరారు.

Updated Date - Mar 11 , 2025 | 05:38 AM