Share News

Ayyappa: 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప దర్శనం

ABN , Publish Date - Feb 16 , 2025 | 05:03 AM

అయ్యప్ప భక్తులకు శుభవార్త..! ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర పద్దెనిమిది మెట్లు ఎక్కగానే.. అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి అనుమతిస్తారు. ఇంతకు ముందు పదునెట్టాంబడి ఎక్కగానే.. భక్తులను ఎడమవైపునకు మళ్లించేవారు.

Ayyappa: 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప దర్శనం

  • ఫ్లైఓవర్‌ బ్రిడ్జి తొలగింపు.. మార్చి 14 నుంచి అమలు

  • ఇరుముడితో వస్తే నేరుగా దర్శనం

(సెంట్రల్‌ డెస్క్‌): అయ్యప్ప భక్తులకు శుభవార్త..! ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర పద్దెనిమిది మెట్లు ఎక్కగానే.. అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి అనుమతిస్తారు. ఇంతకు ముందు పదునెట్టాంబడి ఎక్కగానే.. భక్తులను ఎడమవైపునకు మళ్లించేవారు. అక్కడి నుంచి ఆలయం చుట్టూ.. సుమారు 500 మీటర్ల దూరం ఉండే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదుగా.. సన్నిధానాన్ని చేరుకోవాల్సి వచ్చేది. శబరిమల ఆలయ అభివృద్ధిలో భాగంగా.. అధికారులు కొత్త లేఅవుట్‌ను డిజైన్‌ చేశారు. దీని ప్రకారం సన్నిధానం చుట్టూ ఉన్న ఫైఓవర్‌ బ్రిడ్జిని తొలగిస్తారు. వచ్చేనెల 14న మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరుస్తారు. ఆ సీజన్‌లో ఇరుముడితో వెళ్లే భక్తులు.. 18 మెట్లు ఎక్కగానే.. నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా రెండు లేదా నాలుగు లైన్లను ఏర్పాటు చేస్తారు. భక్తులు బలికల్‌పుర(కణిక్క వంచి-నైవేద్య పాత్ర) మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకోవచ్చు. ఇంతకు ముందు ఫ్లైఓవర్‌ దిగాక.. అయ్యప్ప సన్నిధి ఎడమ వైపు నుంచి దర్శనానికి అనుమతించేవారు.


దీని వల్ల.. సన్నిధానానికి ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే రెండు లేదా మూడు సెకన్ల పాటు అయ్యప్ప దర్శనం లభించేది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తోపులాట, పోలీసులు లాగేయడం వల్ల మండలకాలం కఠిన దీక్షను పూర్తిచేసుకుని, అంతదూరం వెళ్లినా.. దర్శనం సరిగ్గా జరగలేదనే బాధ భక్తుల్లో ఉండేది. కణిక్కవంచి నుంచి వెళ్లేప్పుడు 30 సెకన్ల నుంచి నిమిషం వరకు అలా అయ్యప్పను దర్శించుకుంటూ ముందుకు సాగే అవకాశాలుంటాయి. ప్రస్తుతం శబరిమలలో కుంభమాస పూజలు జరుగుతున్నాయి. ఈ నెల 21 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. 17వ తేదీ నుంచి ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి తొలగింపు, ఇతర అభివృద్ధి పనులను చేపడతారు. హైకోర్టు కూడా కొత్త ప్రణాళికకు ఆమోదముద్ర వేసింది. హైకోర్టు నియమించిన శబరిమల ప్రత్యేక కమిషనర్‌ ఆర్‌.జయకృష్ణన్‌, ట్రావెన్‌కోర్‌ బోర్డు అధ్యక్షుడు పీఎస్‌ ప్రశాంత్‌ పర్యవేక్షణలో పనులు ప్రారంభమవుతాయి. కాగా.. ప్రస్తుతం ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని భక్తుల రద్దీ నేపథ్యంలో 1989లో ఏర్పాటు చేశారు.

Updated Date - Feb 16 , 2025 | 08:24 AM