త్వరలో ఒక్కటి కానున్న ఎంపీ తేజస్వి సూర్య, గాయని శివశ్రీ స్కందప్రసాద్
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:17 AM
బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్విసూర్య ఓ ఇంటివాడు అవుతున్నారు. చెన్నైకి చెందిన గాయని, భరతనాట్య కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్‌ను ఆయన పెళ్లి చేసుకోనున్నారు.
బెంగళూరు, జనవరి 1(ఆంధ్రజ్యోతి): బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్విసూర్య ఓ ఇంటివాడు అవుతున్నారు. చెన్నైకి చెందిన గాయని, భరతనాట్య కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్‌ను ఆయన పెళ్లి చేసుకోనున్నారు. రెండోసారి ఎంపీగా, భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తేజస్వి సూర్య వివాహం గురించి ఆరేడేళ్లుగా పలు సభలు, సమావేశాలలో ప్రస్తావనలు వచ్చాయి. ఆయన సున్నితంగా దాటవేస్తూ వచ్చారు. తాజాగా ఆయన వివాహం గురించి రెండు కుటుంబాలవారు నిర్ణయానికి వచ్చారని తెలిసింది. 29 ఏళ్ల శివశ్రీ శస్త్ర యూనివర్సిటీలో బయో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మద్రాస్ యూనివర్సిటీలో భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత యూనివర్సిటీలో సంస్కృతంలో ఎంఏ పూర్తి చేశారు.
సైక్లింగ్, ట్రెక్కింగ్ అంటేనూ ఆమె ఆసక్తి చూపుతారు. ఆమె యూట్యూబ్ చానెల్‌కు రెండు లక్షలమంది ఫాలోయెర్స్, సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. గత ఏడాది శ్రీరామనవమి సందర్భంగా శివశ్రీ కన్నడలో ‘పూజిసలిందె హూగలుతందె’ (పూజలు చేయ పూలు తెచ్చాను) అనే పాటను పాడటంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమెను ప్రశంసించారు. తేజస్విసూర్యకు 34 ఏళ్లు. ఫిట్‌నెస్, వాక్చాతుర్యంతో రాజకీయాలలో పేరు సంపాదించారు. ఆర్‌ఎ్‌సఎస్, ఏబీవీపీలో పనిచేశారు. తేజస్వి సూర్య లా పూర్తి చేసి, అడ్వకేట్‌గా వృత్తి ప్రారంభించారు. ఆ తరువాత కొంతకాలానికే రాజకీయాల్లోకి వచ్చారు. మార్చిలో వీరి వివాహం జరుగుతుందని తెలిసింది.