Kejriwal contesting in RS MP poll: రాజ్యసభ ఎంపీ సీటుకు కేజ్రీవాల్ పోటీ అంటూ వార్తలు! వివరణ ఇచ్చిన ఆప్
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:29 PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎంపీగా పార్లమెంటులో కాలుపెడతారంటూ వస్తున్న వార్తలపై ఆప్ క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ప్రతిపక్షాలు వ్యాపిస్తున్న రూమర్లంటూ కొట్టి పారేసింది.

ఇంటర్నెట్ డెస్క్: లూథియానా వెస్ట్ అసెంబ్లీ సీటు ఉప ఎన్నికల్లో రాజసభ ఎంపీ సంజీవ్ అరోరాను ఆప్ బరిలోకి దింపడం సంచలనంగా మారింది. ఆయన స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ రాజ్యసభ ఎంపీగా పార్లమెంటులో కాలుపెడతారన్న వార్త కలకలం రేపడంతో ఆప్ తాజాగా స్పందించింది. ఆ వార్తలన్నీ అభూతకల్పనలేనని కొట్టి పారేసింది. ఈ మేరకు ఆప్ పంజాబ్ అధికార ప్రతినిధి జగ్తర్ సింగ్ సంఘేరా మీడియా సమావేశంలో స్పష్టం చేశారు (Kejriwal contesting in RS MP poll?).
‘‘సంజీవ్ అరోరా లూథియానాకు చెందిన వారు. కాబట్టి ఆయనను ఈ ఉపఎన్నికలో బరిలోకి దింపాము. ఇక ఆయన స్థానంలో రాజ్యసభకు ఎవరిని పంపించాలనేదానిపై పార్టీ చర్చిస్తోంది. కేజ్రీవాల్ పార్లమెంటులో ఎంపీగా కాలుపెట్టనున్నారన్న వార్తల్లో వాస్తవం లేదు. ప్రతిపక్షాలు రూమర్లను వ్యాపింప చేస్తున్నాయి. కేజ్రీవాల్ రాజ్యసభ సభ్యత్వంపై పార్టీలో అసలు చర్చే లేదు’’ అని సంఘేరా స్పష్టం చేశారు.
Maha Kumbh culmination today: కుంభమేళా చివరి రోజు.. అమృత స్నానం కోసం పోటెత్తుతున్న భక్తులు
మరోవైపు, లూథియానా నుంచి బరిలో దిగడంపై అరోరా కూడా స్పందించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. లూథియానాతో తనకు ఎంతో అనుబంధం ఉందని, అక్కడి ప్రజలకు సేవ చేసేందుకు తాను ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని అన్నారు.
ఆప్ చర్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహ్‌జాద్ పూనావాలా ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘‘రాజ్యసభ ఎంపీ అరోరాను లూథియానా ఉప ఎన్నికల బరిలోకి దింపేందుకు ఆప్ నిర్ణయించింది. అరోరాను తప్పుకునేలా బలవంతం చేసి ఆయన స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎంపీగా రాజ్యసభలో కాలుపెట్టొచ్చని మీడియా చెబుతోంది. ఇది అధికారంపై లాలసా కాదా?’’ అని ప్రశ్నించారు.
Shashi Tharoor: కేంద్ర మంత్రి గోయల్‌తో శశి థరూర్ సెల్ఫీ
ఇక కేజ్రీవాల్ రాజ్యసభలో కాలు పెట్టడం 100 శాతం ఖాయమని పంజాబ్ కాంగ్రెస్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా అన్నారు. ‘‘దివంగత ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగీ స్థానంలో నిలబడదామని ఆయన అనుకున్నారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావొచ్చన్న ఆలోచనతో వెనకడుగు వేశారు’’ అని ఆయన అన్నారు.
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. 2015, 2020 నాటి ఎన్నికల్లో 70 సీట్లకు గాను 60కి పైగా సీట్లల్లో గెలిచిన ఆప్ ఈసారి మాత్రం కేవలం 22 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా ఓటమి చవి చూడాల్సి వచ్చింది.