Share News

Cyber Fraud: ముసలి వాళ్లనే జాలి కూడా లేకుండా.. బరి తెగించిన సైబర్ నేరగాళ్లు

ABN , Publish Date - Mar 29 , 2025 | 08:18 AM

సైబర్ నేరగాళ్ల ధాటికి తట్టుకోలేక.. ఆత్మహత్యే శరణ్యంగా భావించి.. సూసైడ్ చేసుకున్నారు వృద్ధ దంపతులు. సైబర్ కేటుగాళ్లు తమను ఎలా మోసం చేశారో వెల్లడిస్తూ.. సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. ఆ వివరాలు..

Cyber Fraud: ముసలి వాళ్లనే జాలి కూడా లేకుండా.. బరి తెగించిన సైబర్ నేరగాళ్లు
Karnataka

బెంగళూరు: సమాజంలో సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అమాయుకులు, చదువు రాని వారే సైబర్ మోసగాళ్ల వలలో పడుతున్నారా అంటే.. కాదు. బాగా చదువుకుని.. మంచి ఉద్యోగాల్లో ఉన్న వారిని సైతం సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు. ఏదో ఒక ఒంక చెప్పి.. బాధితుల ఖాతాల నుంచి లక్షల రూపాయలు మాయం చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఒకరు సైబర్ మోసగాళ్ల వలకు చిక్కి.. ఒక్కటి కాదు.. రెండు కాదు ఏకంగా 50 లక్షల రూపాయలు మోసపోయాడు. ఆ దారుణాన్ని జీర్ణించుకోలేక.. భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఆ వివరాలు..


బెలగావి జిల్లా ఖానాపూర్ తాలుకాకు చెందిన సంతన్ నజరేత్(82) విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. మహారాష్ట్ర గవర్నమెంట్ సెక్రటేరియట్ ఉద్యోగిగా పని చేసి.. రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం భార్య ఫ్లవియానా(79)తో కలిసి ఖానాపూర్ బీడి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఈ దంపతులకు సంతానం లేరు. బాధ్యతలు ముగించుకుని.. జీవిత చరమాంకంలో ఒకరికొకరు తోడుగా కలిసి ఉంటున్నారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో సైబర్ కేటుగాళ్లు ప్రవేశించడంతో దారుణం చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్నారు.

సైబర్ నేరగాళ్లు తమను మోసం చేశారని.. 50 లక్షల రూపాయలు మోసపోయామని.. ఇందుకు ఎవరిని నిందిచడం లేదని తెలిపాడు నజరేత్. తమకు ఎవరి జాలి అక్కర్లేదని.. బతుకు మీద ఆశ వదిలేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని.. సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చాడు. అంతేకాక తమను మోసం చేసిన వారి పేర్లు కూడా వెళ్లడించాడు. ఆ తర్వాత దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం నాడు ఈ ఘటన వెలుగు చూసింది.


నజరేత్ రాసిన సూసైడ్ నోట్‌లో సుమిత్ బిర్రా, అనిల్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తులు తమను మోసం చేసినట్లు చెప్పుకొచ్చాడు. బిర్రా తనను తాను న్యూఢిల్లీ టెలికామ్ శాఖకు చెందిన అధికారిగా పరిచయం చేసున్నాడు. ఆ తర్వాత నజరేత్ పేరు మీద సిమ్ తీసుకుని.. దాని ద్వారా వేధింపులు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించాడు. అందుకే నజరేత్ మీద కేసు ఫైల్ చేశామని చెప్పాడు. ఆ తర్వాత అనిల్ యాదవ్ కాల్ చేసి తాను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చాడు.


సిమ్ కార్డ్ మిస్‌యూస్ చేశారని.. అందుకు నజరేత్‌పై లీగల్ చర్యలు తీసుకుంటామని బెదిరించాడు. అంతేకాక వారి ఆస్తుల వివరాలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ నేరం నుంచి నరజేత్‌ను తప్పించాలంటే.. 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నిందితులు. వారి మాటలతో భయపడిన నజరేత్.. నిందితుల ఖాతాకు రూ.50 లక్షలు బదిలీ చేశాడు

ఆ తర్వాత కూడా నిందితులు నజరేత్‌కు కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. చేసేదేం లేక.. భార్య బంగారం తాకట్టు పెట్టి, స్నేహితుల వద్ద అప్పు చేసి మరి 7.15 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత కూడా వేధింపులు ఆగకపోవడంతో.. విసిగిపోయిన నజరేత్.. ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. తమను వేధించిన వారి గురించి సూసైడ్ నోట్ రాసి.. నజరేత్, అతడి భార్య ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఆన్‌లైన్‌ మోసాలకు ఇక అడ్డుకట్ట..

ఏటీఎం లావాదేవీలు మరింత భారం

Updated Date - Mar 29 , 2025 | 08:21 AM