Share News

కర్ణాటక ఆర్టీసీకి ‘ఉచితం’ దెబ్బ?

ABN , Publish Date - Jan 03 , 2025 | 06:29 AM

‘శక్తి’ గ్యారెంటీ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌలభ్యాన్ని కల్పిస్తున్న కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం... ఇతర ప్రయాణికులపై భారం మోపేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

కర్ణాటక ఆర్టీసీకి ‘ఉచితం’ దెబ్బ?

  • బస్సు చార్జీలు 15 శాతం పెంపు

  • కర్ణాటక మంత్రివర్గం ఆమోదం

బెంగళూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ‘శక్తి’ గ్యారెంటీ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌలభ్యాన్ని కల్పిస్తున్న కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం... ఇతర ప్రయాణికులపై భారం మోపేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలోని నాలుగు ఆర్టీసీ కార్పొరేషన్‌లు చార్జీల పెంపునకు చేసిన ప్రతిపాదనలను గురువారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఏకంగా 15 శాతం చార్జీలను పెంచేందుకు అనుమతించింది. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమలులోకి రానున్నాయి. 2016తో పోల్చితే ఆర్టీసీపై రోజువారీ డీజిల్‌ భారం రూ.9.16 కోట్ల నుంచి రూ.13.2 కోట్లకు పెరిగిందని... చార్జీల పెంపుతో ఆర్టీసీ కార్పొరేషన్లకు నెలకు రూ.74.85 కోట్ల ఆదాయం అదనంగా వస్తుందని ప్రభుత్వం తెలిపింది.


కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘శక్తి’ కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెలా రూ.417 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ పథకం యథాతథంగా కొనసాగిస్తామని మంత్రి హెచ్‌కే పాటిల్‌ పేర్కొన్నారు. అయితే... తాజా పెంపుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ‘ఒకే కుటుంబంలో భార్యకు ఉచిత ప్రయాణం! భర్తపై అదనపు భారం. ఇదేనా మీ పథకం’ అని విమర్శిస్తున్నాయి.

Updated Date - Jan 03 , 2025 | 06:29 AM