Betting Case: బెట్టింగ్ యాప్ కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు
ABN , Publish Date - Mar 26 , 2025 | 10:29 AM
బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ వివరాలు..

ఛత్తీస్‌గఢ్: బెట్టింగ్ కేసు వ్యవహారం మరింత ముదురుతోంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు సినీ, సోషల్ మీడియా సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేయడమే కాక విచారిస్తున్నారు. తాజాగా ఈ బెట్టింగ్ కేసు వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. బెట్టింగ్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు.. ఓ మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ వివరాలు..
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి సీబీఐ నేడు (బుధవారం) ఉదయం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. రాయ్‌పూర్, భిలాయ్‌లోని బఘేల్ నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బఘేల్‌తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్ పోలీసు అధికారి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. దీనిపై బఘేల్ కార్యాలయం ట్వీట్ చేసింది. "భూపేశ్ బఘేల్.. ఈ రోజు కాంగ్రెస్ డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశానికి హాజరవ్వడ కోసం ఢిల్లీ వెళ్లాల్సి ఉండే. ఆయన ఆ ప్రయత్నాల్లో ఉన్న సమయంలోనే సీబీఐ రాయ్‌పూర్, బిలాయ్ నివాసాల్లో సోదాలు నిర్వహించేందుకు వచ్చింది" అంటూ ట్వీట్ చేసింది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా.. గతంలోనే ఈడీ సుమారు 2,295 వేల కోట్ల రూపాయలను సీజ్ చేసి అటాచ్ చేసింది. ఇక ఇటీవల మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి బఘేల్, అతని కుమారుడు చైతన్య నివాసంలో ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా వారు 30 లక్షల రూపాయల నగదు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నేడు (బుధవారం) జరిగిన సోదాలపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించే ఈ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.
సుమారు 6 వేల కోట్ల రూపాయల విలువైన మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బఘేల్‌పై రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. 2023 ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు ముందు మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. భూపేశ్ సీఎంగా ఉన్న సమయంలో బెట్టింగ్ యాప్‌ను డిజైన్ చేసేందుకు ప్రోత్సాహించారని.. ఇందుకు గాను ఆయనకు రూ.508 కోట్లు చెల్లించినట్లు యాప్ యజమాని శుభమ్ సోనీ ఆరోపణలు చేశాడు. అయితే భూపేశ్.. ఈ ఆరపణలను ఖండించారు.
ఇవి కూడా చదవండి:
ఫిరాయింపులపై గత తీర్పులను ఎలా మార్చగలం
అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ