Jammu Kashmir: కశ్మీర్‌లో మిస్టరీ మరణాలు
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:09 AM
ప్రకృతి అందాలకు నెలవైన జమ్మూకశ్మీర్‌లో మిస్టరీ మరణాలు ప్రజలకు, అధికారులకు దడ పుట్టిస్తున్నాయి.

నెలన్నర వ్యవధిలో 15 మంది మృతి
జమ్మూ, జనవరి 16: ప్రకృతి అందాలకు నెలవైన జమ్మూకశ్మీర్‌లో మిస్టరీ మరణాలు ప్రజలకు, అధికారులకు దడ పుట్టిస్తున్నాయి. కశ్మీర్ రాజౌరి జిల్లాలోని బుధాల్ గ్రామంలో నెలున్నర వ్యవధిలో 15 మంది మృతి చెందగా వారిలో ఎక్కువగా చిన్నారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బాఽధితులు వాంతులు చేసుకుని, ఒక్కసారిగా స్పృహ కోల్పోతున్నారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణిస్తున్నారు.
బాధితుల నమూనాలను లేబరేటరీలకు పంపగా.. వారి మరణాలకు బ్యాక్టీరియా లేదా వైరస్ కారక సాంక్రమిక వ్యాధులు కారణం కాదని తేలడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయితే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సకాలజీ రీసెర్చ్ (ఐఐటీఆర్) నిర్వహించిన విశ్లేషణలో మాత్రం ఆ నమూనాల్లో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు తేలింది. దీంతో అప్రమత్తమయిన ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని వివిధ శాఖలను ఆదేశించింది. దర్యాప్తు కోసం 11 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.