PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది
ABN , Publish Date - Mar 16 , 2025 | 06:05 PM
భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి పాల్గొన్నారు.

న్యూఢిల్లీ: భారతదేశం గౌతమబుద్ధుడు, మహాత్మాగాంధీ పుట్టిన నేల అని, ఆ కారణంగానే భారతదేశ శాంతి సందేశం ప్రపంచదేశాల్లో ప్రతిధ్వనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోందని చెప్పారు. ఆమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ప్రజాజీవితంలో తన ప్రయాణం, చిన్ననాటి విషయాలు, ఆర్ఎస్ఎస్‌తో తన అనుబంధం, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మిత్రత్వంతో సహా పలు విషయాలకు ఈ ఇంటర్వ్యూలో మోదీ సమాధానమిచ్చారు.
Amit Shah: గర్ల్ టాలెంట్‌కు ఫిదా అయిన అమిత్ షా.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన హోంమంత్రి..
140 కోట్ల ప్రజలే నా బలం
''నా బలం నా పేరులో లేదు. 140 కోట్ల మంది ప్రజలు, కాలానికి నిలిచిన దేశ సంస్కృతి, వారసత్వం నా వెనుక ఉండటమే నా బలం" అని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ దేశాధినేతలతో కరచాలనం చేస్తున్నానంటే ఆ కరచాలనం ఘనత మోదీది కాదని, 140 కోట్ల భారతీయులకే ఆ ఘనత చెందుతుందని అన్నారు.
సైద్ధాంతిక పునాదులు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)తో తన అనుబంధం, అక్కడ నేర్చుకున్న విలువలే తన సైద్ధాంతిక పునాదులని మోదీ స్పష్టం చేశారు. దేశం కన్నా మిన్న ఏదీ లేదని, సమాజ సేవే దైవ సేవ అని ఆర్ఎస్ఎస్ నుంచి తాను నేర్చుకున్నానని, ఆర్ఎస్ఎస్ తమ సభ్యులందరికీ దేశం పట్ల, ప్రజల పట్ల అలాంటి బలమైన భావాలను పాదుకొల్పుతుందని చెప్పారు. దేశ సేవలో ఆర్ఎస్ఎస్ కంట్రిబ్యూషన్ ఎంతో ఉందని, విద్యాపరంగా "విద్యాభారతి'' పేరుతో దేశవ్యాప్తంగా 70,000 పాఠశాలలు నడుపుతోందని, 30 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తోందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ కంటే అతిపెద్ద స్వయంసేవక్ సంఘ్ ప్రపంచంలోనే లేదని ప్రశంసించారు. ఆర్ఎస్ఎస్ జర్నీ 100 ఏళ్లకు చేరుకుందని చెప్పారు.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై..
ఉగ్రవాదం అనేది ఇండియా సమస్య మాత్రమే కాదని, యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తు్న్న సమస్య అని ప్రధాని మోదీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రధాన ఉగ్రవాద దాడుల్లో పాక్ ప్రమేయం కూడా తరచు ముడిపడి కనిపిస్తుందని ఒసామాబిన్ లాడెన్‌ను పాక్‌లో మట్టుబెట్టిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ అన్నారు. టెర్రరిజంతో ఎవ్వరికీ ప్రయోజనం ఉండదని ఇండియా తరచు హెచ్చరిస్తూనే ఉందని, కానీ పాకిస్థాన్ మద్దతు పలుకుతూనే ఉందని అన్నారు. స్టేట్-స్పాన్సర్డ్ టెర్రరిజం అనేది ఇతర దేశాలకు హాని చేయడంతో పాటు సొంత ప్రజానీకం, దేశ భవిష్యత్తును కూడా నాశనం చేస్తుందని చెప్పారు. ఉగ్రవాదానికి స్వదేశంలో ఆశ్రయం ఇవ్వడం, ప్రోత్సహించడం పాక్ మానుకోవాలని హితవు పలికారు. భారత్‌తో పాక్ ప్రచ్ఛన్న యుద్ధం చేస్తోందని, టెర్రరిజాన్ని ఇండియాకు ఎగుమతి చేస్తోందని తప్పుపట్టారు.
ఇవి కూడా చదవండి..