Budget-2025: భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా నిలుపుతాం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:29 AM
ఢిల్లీ: ప్రపంచంలోనే భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలపనున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందించడమే లక్ష్యమని ఆమె చెప్పారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఢిల్లీ: ప్రపంచంలోనే భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలపనున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందించడమే లక్ష్యమని అన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశిస్తూ పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పార్లమెంట్ ఉభయ సభలు నివాళులు అర్పించాయి. ప్రధానిగా ఆయన చేసిన సేవలను పార్లమెంట్ సాక్షిగా కొనియాడారు. మరోవైపు మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనలో మృతులకు సైతం ఉభయ సభల సభ్యులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. "బడ్జెట్-2025లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మా ప్రభుత్వం మూడో టెర్మ్‌లో మూడు రెట్ల వేగంతో అభివృద్ధి దూసుకెళ్తోంది. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే మా లక్ష్యం. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నాం. 3 కోట్ల మంది పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నాం. పేద, మధ్యతరగతి ప్రజలకు హోమ్ లోన్ సబ్సిడీ ఇస్తున్నాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. రూ.70 వేల కోట్లతో గ్రామీణ రహదారులు అభివృద్ధి చేస్తున్నాం. ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని నియమించాం. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం. ట్యాక్స్ విధానాలను సరళీకరించాం. భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లతో గొప్ప ముందడుగు వేస్తున్నాం. 70 ఏళ్లు దాటిన 6 కోట్ల మందికి ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం. యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. భారతీయులు అంతరిక్షంలో అడుగుపెట్టే రోజు దగ్గర్లోనే ఉంది. భారత మహిళలు ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తున్నారు. విద్యా రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మారుస్తాం. ఇండియా ఏఐ మిషన్‌ను ప్రారంభించాం. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. స్పోర్ట్స్ నుంచి స్పేస్ వరకూ భారత్ దూసుకుపోతోంది. ఎంఎస్ఎమ్ఈల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ తీసుకొచ్చాం. ఇ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పౌర విమానయాన రంగం అభివృద్ధి చెందుతోంది.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. పోలవరం నిర్మాణానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. సైబర్ సెక్యూరిటీలో సమర్థత పెంచుతున్నాం. దేశ ఆర్థిక, సామాజిక, జాతీయ భద్రతకు పని చేస్తున్నాం. డిజిటల్ మోసాలు, సైబర్ క్రైమ్, డీప్ ఫేక్ పెనుముప్పుగా మారాయి. దళితులు, వెనకబడిన వర్గాలకు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నాం. ఆదివాసీ ప్రాంతాల్లో 30 వైద్య కళాశాలలు ప్రారంభించాం. అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి తెచ్చాం. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పెరుగుతున్న క్యాన్సర్ కేసుల దృష్ట్యా ఔషధాలపై కస్టమ్స్ సుంకం తగ్గించామని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Budget- 2025: బడ్జెట్ గురించి అస్సలు తెలియదా.. ఇవి తెలుసుకోండి ఇట్టే అర్థం అవుతుంది..
PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్