Rahul Gandhi: కులవివక్ష అంతానికి రోహిత్ వేములచట్టం చేయండి
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:45 AM
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రాహుల్ గాంధీ రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని సూచించారు. కులవివక్ష నివారించేందుకు ఈ చట్టం తీసుకురావడం అత్యవసరం అని పేర్కొన్నారు
కర్ణాటక సీఎంకు రాహుల్‌గాంధీ లేఖ
న్యూఢిల్లీ/బెంగళూరు, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా భారత విద్యావ్యవస్థలో కులవివక్ష పోలేదని.. దీనికి స్వస్తి పలికేందుకు కర్ణాటకలో ‘రోహిత్ వేముల చట్టం’ తీసుకురావాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ సీఎం సిద్దరామయ్యకు సూచించారు. ఈ మేరకు ఈ నెల 16న లేఖ రాశారు. దానిని శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కులవివక్ష కారణంగా హెచ్‌సీయూకు చెందిన దళిత విద్యార్థి రోహిత్ వేముల 2016లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ‘‘ప్రతిభావంతులైన రోహిత్ వేముల, పాయల్ తడ్వీ(మహారాష్ట్ర), దర్శన్ సోలంకీ (ముంబై) (ఆత్మ)హత్యలను ఎంత మాత్రం ఆమోదించలేం. దీనికి అంతం పలకడానికి ఇదే సమయం. అంబేడ్కర్, రోహిత్ సహా కోట్ల మందిలా మరే పిల్లవాడూ ఎదుర్కోకుండా రోహిత్ వేముల చట్టం చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతున్నా’’ అని తెలిపారు.