Share News

Ranya Rao: చెంపదెబ్బలు కొట్టారు, తిండిపెట్టలేదు.. డీఆర్ఐ ఏడీజీకి రన్యారావు లేఖ

ABN , Publish Date - Mar 15 , 2025 | 03:40 PM

సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రరావు కుమార్తె అయిన రన్యారావును బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు ఇటీవల అడ్డుకుని, రూ.12.56 కోట్లు విలువచేసే అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Ranya Rao: చెంపదెబ్బలు కొట్టారు, తిండిపెట్టలేదు.. డీఆర్ఐ ఏడీజీకి రన్యారావు లేఖ

బెంగళూరు: దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా (Gold Smuggling) చేస్తూ అడ్డంగా పట్టుబడిన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) విచారణలో అధికారులు తనను అనేకమార్లు చెంపదెబ్బలు కొట్టారని, తిండి పెట్టలేదని, ఖాళీ డాక్యుమెంట్లపై బలవంతంగా తనతో సంతకాలు పెట్టించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు డీఆర్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌కు ఆమె లేఖ రాశారు. తాను అమాయకురాలినని, తప్పుడు కేసులో తనను ఇరికించారని ఆమె వాపోయారు. రన్యారావుకు బెయిల్ ఇవ్వడానికి విచారణ కోర్టు శుక్రవారంనాడు నిరాకరించిన నేపథ్యంలో ఆమె తాజా ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావుకు బెయిలు నిరాకరణ


సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రరావు కుమార్తె అయిన రన్యారావును బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు ఇటీవల అడ్డుకుని, రూ.12.56 కోట్లు విలువచేసే అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడురోజుల డీఆర్ఐ కస్టడీ అనంతరం ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఆమె ఉన్నారు. ఈ నేపథ్యంలో పరప్పర అగ్రహార జైలు చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా ఆమె తన లేఖను డీఆర్ఐ ఏడీజీకి తాజాగా పంపారు.


విమానంలోనే అరెస్టు చేశారు.. కొట్టిన వాళ్లను గుర్తుపడతా

విమానంలోనే తనను అరెస్టు చేశారని, తనను మాట్లాడేందుకు కూడా డీఆర్ఐ అవకాశం ఇవ్వకుండా కస్టడీలోకి తీసుకుందని ఆ లేఖలో రన్యారావు పేర్కొన్నారు. డీఆర్ఐ అధికారులు పలుమార్పు తనను చెంపదెబ్బలు కొట్టినా వారు సిద్ధం చేసిన డాక్యుమెంట్లపై సంతకం పెట్టేందుకు తాను నిరాకరిస్తూ వచ్చానన్నారు. అయితే అతి బలవంతం మీద తనతో టైపింగ్ చేసిన 50-60 పేపర్లు, 40 ఖాళీ తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించారని ఆమె ఆరోపించారు. తనను అరెస్టు చేసినప్పటి నుంచి కోర్టు ముందు హాజరుపరచేంత వరకూ అనేక సార్లు శారీరక దాడులు జరిపారని, 10-15 సార్లు చెంపదెబ్బలు కొట్టారని, ఆ అధికారులను తాను గుర్తుపడతానని చెప్పారు.


బంగారం ఏదీ సాధ్వీనం చేసుకోలేదు

అక్రమ బంగారం కేసులో తనను ప్రశ్నించడంపై చట్టబద్ధతను రన్యారావు ప్రశ్నిస్తూ, తన నుంచి ఎలాంటి బంగారం స్వాధీనం చేసుకోలేదన్నారు. ఈ కేసులో అనుమానితులను కాపాడేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ఆఫీసర్ల పేరు చెప్పుకుని తనను తప్పుడు కేసులో ఇరికించారని ఆమె తెలిపారు. డీఆర్ఐ అధికారులు విచారణలో తన తండ్రి ఐడెంటిటీ చెప్పమని తనను బెదిరించారని, ఈ కేసులో తన తండ్రికి ఎలాంటి ప్రమేయం లేదని ఆమె చెప్పారు. మార్చి 3వ తేదీ రాత్రి 6.45 నుంచి మార్చి 4వ తేదీ రాత్రి 7.50 వరకూ అధికారులు ఉద్దేశపూర్వకంగా తనను నిద్రపోనీయలేదని, తిండి పెట్టలేదని ఆరోపించారు.


ఆసక్తికరంగా, మార్చి 10న రన్యారావు కోర్టులో చెప్పిన దానికి భిన్నంగా తాజా ఆరోపణలు ఉన్నాయి. డీఆర్ఐ అధికారులు విచారణలో తనను దూషించారని, మానసికంగా వేధించారని, అయితే శారీరక దాడులు మాత్రం చేయలేదని చెప్పారు.


కమిలిపోయిన కన్ను

రన్యారావు కస్టడీలో ఉన్న సమయంలో ఆమెకు చెందిన ఒక ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. కంటి కింద గాయాలు, ఉబికిన మొహంతో ఆమె ఫోటోలో కనిపిస్తోంది. దీంతో ఆమెకు ఏమి జరిగింది? విచారణ పేరుతో ఆమెపై దాడి జరిగిందా? అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నాగలక్ష్మి చౌదరి సైతం స్పందించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదు చేయకుండా దానిపై తాము కామెంట్ కూడా చేయలేమన్నారు.


ఇవి కూడా చదవండి..

DMK Leaders: హిందీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు.. డీఎంకే నేతల రియాక్షన్

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 15 , 2025 | 06:16 PM