Share News

Supreme Court: ఇప్పటికే మాపై విమర్శలు

ABN , Publish Date - Apr 22 , 2025 | 03:41 AM

పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లపై నివేదిక కోరాలన్న పిటిషన్‌పై స్పందించిన జస్టిస్‌ గవాయ్‌, ఇప్పటికే న్యాయవ్యవస్థపై కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామని విమర్శలు వస్తున్నాయని అన్నారు

Supreme Court: ఇప్పటికే మాపై విమర్శలు

  • కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాల్లోకి చొరబడుతున్నామని ఆరోపణలు

  • పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లపై నివేదిక కోరాలన్న

  • పిటిషన్‌ మీద కాబోయే సీజేఐ గవాయ్‌ వ్యాఖ్యలు

  • ఓటీటీ, సోషల్‌ మీడియాలో అశ్లీలతను

  • నిలువరించాలన్న పిటిషన్‌పైనా ఇదే తరహాలో..

  • కేంద్రమే నిబంధనలు రూపొందించాలని వ్యాఖ్య

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: ముర్షిదాబాద్‌ అల్లర్ల నేపథ్యంలో బెంగాల్లో పరిస్థితిపై రాష్ట్రపతి ఆర్టికల్‌ 355 కింద నివేదిక కోరాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలించనుంది. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ భూషన్‌ ఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు సోమవారం న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ ఈ అంశాన్ని తీసుకొచ్చారు. 2022లో బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లకు సంబంధించి తన పిటిషన్‌ మంగళవారం విచారణకు వస్తోందని గుర్తు చేశారు. తాజాగా వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హిందువులపై దాడులు జరిగాయని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దించాలని, ముగ్గురు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులతో ఈ హింసపై దర్యాప్తు జరిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముర్షిదాబాద్‌ అలర్లపై ఆర్టికల్‌ 355 కింద నివేదిక తెప్పించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు.


ఈ సందర్భంగా జస్టిస్‌ గవాయ్‌ స్పందిస్తూ, ‘‘ఇప్పుడు మమ్మల్ని మీ బాధ్యత మీరు నిర్వర్తించాలంటూ రాష్ట్రపతికి రిట్‌ ఆఫ్‌ మాండమస్‌ జారీ చేయమంటారా? ఇప్పటికే మేం కార్యనిర్వహణ అధికారాల్లోకి చొరబడుతున్నామని విమర్శలు వస్తున్నాయి’’ అని ప్రస్తావించారు. తమిళనాడు గవర్నర్‌ నిలిపేసిన బిల్లులన్నీ ఆమోదం పొందినట్లేనని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌, బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని జస్టిస్‌ గవాయ్‌ ఈ విధంగా స్పందించారని భావిస్తున్నారు. అయితే, తాజా పిటిషన్‌ను మంగళవారం లిస్ట్‌ చేయడానికి జస్టిస్‌ గవాయ్‌ అంగీకరించారు. ఓటీటీల్లో, సోషల్‌ మీడియాలో అశ్లీల దృశ్యాలను నిలువరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ విషయంలోనూ జస్టిస్‌ గవాయ్‌ ఇదే విధంగా స్పందించారు. ‘‘ఎవరు నియంత్రించ గలరు? కేంద్రమే నియమ నిబంధనలు రూపొందించాలి. మేం పూనుకుంటే కార్యనిర్వాహక అధికారాల్లో చట్ట సభల అధికారాల్లో జోక్యం చేసుకున్నారంటారు’’ అని మరోసారి అన్నారు


Read Also: Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీని చంపేసిన భార్య

SpaDeX: ఇస్రో ఖాతాలో మరో ఘనత.. స్పేడెక్స్ రెండో డాకింగ్ ప్రక్రియ సక్సెస్..

China Hydrogen Bomb: చైనా సరికొత్త హైడ్రోజన్‌ బాంబు

Updated Date - Apr 22 , 2025 | 03:41 AM