PM Modi: ఈ రోజు చాలా ముఖ్యమైనది!
ABN , Publish Date - Feb 14 , 2025 | 05:19 AM
ప్రధాని మోదీతో భేటీకి కొద్ది గంటల ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో పెద్ద బాంబ్ పేల్చారు! ప్రతీకార రుసుములపై తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో కీలక పోస్ట్ చేశారు.

ప్రతీకార సుంకాలు ఉంటాయి
మోదీతో భేటీకి ముందు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య
ఇరువురు నేతల మధ్య సుంకాలపై చర్చ?
ఎలాన్ మస్క్, తులసీ గబార్డ్‌తో మోదీ భేటీ
చదువుకోండి.. పని చేసుకోండి!
భారతీయ విద్యార్థులకు యూకే ఆహ్వానం
వాషింగ్టన్, ఫిబ్రవరి 13: ప్రధాని మోదీతో భేటీకి కొద్ది గంటల ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో పెద్ద బాంబ్ పేల్చారు! ప్రతీకార రుసుములపై తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో కీలక పోస్ట్ చేశారు. ‘‘మూడు వారాలు గొప్పగా నడిచాయి. కానీ, ఈ రోజు మరింత ముఖ్యమైనది. ప్రతీకార రుసుములపై నిర్ణయం ఉంటుంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్’’ అంటూ ట్రంప్ గురువారం ‘ట్రూత్ సోషల్’లో పేర్కొన్నారు. అంటే మోదీతో జరిగే సమావేశంలో సుంకాల విషయంపై తప్పనిసరిగా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. అమెరికా ఉత్పత్తులపై వివిధ దేశాలు విధిస్తున్న దిగుమతి సుంకాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు.. వాటికి తాము కూడా అదే రీతిలో బదులిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచారు. మరోవైపు ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. ఈ చర్యతో అమెరికా కంపెనీలు తయారీ చేసే ఉత్పత్తుల వినియోగం పెరుగుతుందని భావించారు. ఈ సుంకం భారత్‌కు కూడా వర్తిస్తుంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్ స్టాక్ మార్కెట్ 1000కి పైగా పాయింట్లు నష్టపోయింది కూడా. ఈ సుంకం పెంపు అంశాన్ని కూడా ట్రంప్‌తో భేటీలో మోదీ లేవనెత్తుతారని భావిస్తున్నారు.
భారత్ నుంచి అమెరికాకు పెద్దగా ఉక్కు ఎగుమతి కావడం లేదు. కానీ, ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారుల్లో భారత్ ఒకటి. అలాగే అల్యూమినియం ఎగుమతుల్లో భారత్‌కు అతిపెద్ద మార్కెట్ అమెరికా. ట్రంప్ సుంకాలను పెంచిన నేపథ్యంలో భారత్‌కు చెందిన వేదాంత, హిందాల్కో వంటి అల్యూమినియం ఉత్పత్తి సంస్థలు క్రమంగా ప్రత్యామ్నాయ మార్కెట్లను చూసుకోవాల్సి ఉంటుంది. అయితే మోదీ మాత్రం ట్రంప్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అవి టెక్నాలజీ, వాణిజ్యం, రక్షణ వంటి కీలక రంగాల్లో ఇరుదేశాల మధ్య బంధాలు మరింత బలోపేతం కావడానికి దోహదపడతాయని ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందే భారత్ లక్ష్యంగా పలు వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉత్పత్తులపె భారీ దిగుమతి సుంకాలను విధిస్తోందని ఆరోపించారు. గత నెలలో భారత్, బ్రెజిల్, చైనా దేశాలతో అమెరికాకు ముప్పు పొంచి ఉందని కూడా వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గిస్తున్నట్లు భారత్ ఇటీవల ప్రకటించింది. విలాసవంతమైన మోటార్ సైకిళ్లు, కార్లు, స్మార్ట్‌ఫోన్ కాంపొనెంట్లపై దిగుమతి సుంకం తగ్గించింది. ఈ నిర్ణయంతో హార్లే డేవిడ్‌సన్, టెస్లా, యాపిల్ వంటి అమెరికా దిగ్గజ కంపెనీలకు లబ్ధి చేకూరనుంది. అయితే ట్రంప్ సుంకాలను పెంచడం వల్లే భారత్ కస్టమ్స్ సుంకాలను హేతుబద్ధీకరించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తులసీ గబార్డ్, మస్క్‌తో మోదీ భేటీ
అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇంటెలిజెన్స్, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, పెరుగుతున్న ముప్పుల విషయంలో ఇరుదేశాలు మరింతగా సహకరించుకోవడంతో పాటు పలు అంశాలపై చర్చించారు. అమెరికా అత్యున్నత ఇంటెలిజెన్స్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన హిందూ అమెరికన్ తులసిని మోదీ అభినందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ వాల్జ్‌తో మోదీ సమావేశమయ్యారు. స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌తోనూ భేటీ అయ్యారు. మస్క్ తన ముగ్గురు పిల్లలతో వచ్చి బ్లెయిర్ హౌస్‌లో ఉన్న మోదీని కలిశారు.
అమెరికాలో రేషన్ పద్ధతిలో కోడిగుడ్లు!
అమెరికాలో ఇప్పుడు కోడిగుడ్లకు కొరత ఏర్పడింది. డజన్ గుడ్ల ధర ఏకంగా ఆల్‌టైమ్ రికార్డు గరిష్ఠం 4.95 డాలర్లకు చేరుకుంది. అయినా.. డిమాండ్‌కు తగ్గ సరఫరా మార్కెట్లో లేదు. దీంతో.. అనేక స్టోర్లలో ‘లిమిటెడ్ స్టాక్’.. ‘నో ఎగ్స్’.. బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని స్టోర్లలో ఒక్కొక్కరికి రెండు ట్రేలు(డజన్ గుడ్లు), మరికొన్నింటిలో మూడు ట్రేలు విక్రయిస్తున్నారు. ఈ కొరతకు బర్డ్‌ఫ్లూ వ్యాప్తి ప్రధాన కారణం. జనవరిలో డజను గుడ్ల ధర 2.52 డాలర్లు ఉండగా.. డిసెంబరుకు 4.15 డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు 4.95 డాలర్లకు పెరిగింది.
ట్రంప్ మంత్రి వర్గంలో మరో భారత సంతతి వ్యక్తి
దక్షిణాసియా వ్యవహారాల సహాయ మంత్రిగా పాల్ కపూర్
ట్రంప్ మంత్రివర్గంలో మరో భారతీయ సంతతి వ్యక్తికి చోటు లభించనుంది. దక్షిణాసియా భద్రతపై నిపుణుడైన పాల్‌కపూర్‌ను దక్షిణాసియా వ్యవహారాల అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ట్రంప్ నియమించారు. ఈ నియామకానికి సెనెట్ ఆమోదం లభిస్తే డొనాల్డ్ లూ స్థానంలో కపూర్ పదవీ బాధ్యతలు చేపడతారు. కపూర్ నియామకం దక్షిణాసియా ముఖ్యంగా భారత్, పాకిస్థాన్‌పై అమెరికా విధానంలో మార్పును సూచిస్తోందన్న వాదన వినిపిస్తోంది.