Share News

Maharashtra: బాబాయ్‌,అబ్బాయ్‌ మధ్య సయోధ్య!

ABN , Publish Date - Jan 03 , 2025 | 04:39 AM

మహారాష్ట్ర ఎన్‌సీపీలోని వైరివర్గాలు ఒక్కటి కాబోతున్నాయా? కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు బాబాయి శరద్‌ పవార్‌, అబ్బాయి అజిత్‌ పవార్‌ విభేదాలు మరచి రాజీపడబోతున్నారా..? అజిత్‌ తల్లి ఆశా తాయి, ఆయన వర్గం ఎన్‌సీపీ అగ్రనేత ప్రఫు ల్‌ పటేల్‌ వ్యాఖ్యలు ఈ సంకేతాలే ఇస్తున్నాయి.

Maharashtra: బాబాయ్‌,అబ్బాయ్‌ మధ్య సయోధ్య!

  • పవార్‌లు కలవాలని కోరుతున్న అజిత్‌ తల్లి

  • శరద్‌ పవార్‌ మాకు దేవుడు: ప్రఫుల్‌ పటేల్‌

ముంబై, జనవరి 2: మహారాష్ట్ర ఎన్‌సీపీలోని వైరివర్గాలు ఒక్కటి కాబోతున్నాయా? కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు బాబాయి శరద్‌ పవార్‌, అబ్బాయి అజిత్‌ పవార్‌ విభేదాలు మరచి రాజీపడబోతున్నారా..? అజిత్‌ తల్లి ఆశా తాయి, ఆయన వర్గం ఎన్‌సీపీ అగ్రనేత ప్రఫు ల్‌ పటేల్‌ వ్యాఖ్యలు ఈ సంకేతాలే ఇస్తున్నాయి. ఆశా తాయి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవా రం పండరీపురంలో పాండురంగ విఠలుడి ఆలయం వె లుపల మీడియాతో మాట్లాడుతూ.. బాబాయి, అబ్బాయి తిరిగి కలవాలని, కుటుంబంలో సమస్యలన్నీ తీరిపోవాలని పాండురంగడిని వేడుకున్నానని తెలిపారు. ఆ దేవుడు తన కోరికలు నెరవేరుస్తాడని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ప్రఫుల్‌ పటేల్‌ గడ్చిరోలిలో విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ మాకు దేవుడిలాంటివారు. మా అందరికీ తండ్రిలాంటివారు.


గత నెలలో ఆయన జన్మదినం సందర్భంగా మేం ఆయన్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాం కూడా. అయితే అది రాజకీయ భేటీ కాదు. మేం భిన్న రాజకీయ వైఖరి తీసుకున్నప్పటికీ శరద్‌ పవార్‌పై అత్యున్నత గౌరవం ఉంది. పవార్‌ కుటుంబం ఒక్కటైతే మేమంతా సంతోషిస్తాం. నన్ను నేను వారి కుటుంబ సభ్యుడిగానే భావిస్తున్నాను. ఇద్దరూ తిరిగి కలిస్తే ఎవరూ అగౌరవంగా భావించాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. 2023 జూలైలో ఎన్‌సీపీని చీల్చి అజిత్‌ పవార్‌ 40 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ-శిండే శివసేన కూటమి ప్రభుత్వంలో చేరి ఉపముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అజిత్‌ పార్టీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. కానీ ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శిండే శివసేన-అజిత్‌ ఎన్‌సీపీతో కూడిన మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. పవార్‌, అజిత్‌ కలిసిపోతే ఎన్‌సీపీ కార్యకర్తలు ఎంతో లాభపడతారని ఎన్‌సీపీ నేత, రాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్‌ అన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 04:39 AM