Share News

కల నిజమైన రోజు

ABN , Publish Date - Jan 16 , 2025 | 07:46 AM

వెండితెరపై తారగా మెరిసిపోవాలన్నది ఆమె చిన్ననాటి కల. కానీ మనసులో మాట చెబితే అందరూ చులకన చేస్తారనే భయం. ‘అనుష్కాలాగానో... ప్రియాంకలానో నువ్వు లేవు’ అంటారేమోననే సందేహం. ఇన్ని మానసిక సంఘర్షణలను దాటి... తన ఇష్టాన్ని తనలోనే దాచిపెట్టి...

కల నిజమైన రోజు

కల నిజమైన రోజు

సెలబ్‌ టాక్‌

వెండితెరపై తారగా మెరిసిపోవాలన్నది ఆమె చిన్ననాటి కల. కానీ మనసులో మాట చెబితే అందరూ చులకన చేస్తారనే భయం. ‘అనుష్కాలాగానో... ప్రియాంకలానో నువ్వు లేవు’ అంటారేమోననే సందేహం. ఇన్ని మానసిక సంఘర్షణలను దాటి... తన ఇష్టాన్ని తనలోనే దాచిపెట్టి...

పట్టుదలగా ప్రయత్నించింది. సహనంతో... దృఢ సంకల్పంతో అడుగు ముందుకు వేసింది. ఒక మంచి సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది.

ఆమే అర్చితా అగర్వాల్‌.

‘‘చిన్నప్పుడు ఎన్నో కలలు కంటాం. చదువు కోసమనో... పరిస్థితుల ప్రభావంతోనో అవన్నీ మరుగున పడిపోతుంటాయి. కానీ నేను కన్నది ఒకే ఒక్క కల. చిత్ర పరిశ్రమలో స్థిరపడాలని. అదీ నటిగా. ఆ కల నాతోపాటే పెరుగుతూ వచ్చింది. ఎక్కడ ఉన్నా... ఏంచేస్తున్నా... నా ఆలోచనల నుంచి ఎన్నడూ అది పక్కకు పోలేదు. ఎలాగైనా సాధించి తీరాలన్న పట్టుదల, అవకాశం వచ్చేవరకు వేచి చూసేంత సహనం... ఇవే నన్ను ఇవాళ నటిని చేశాయి. కమర్షియల్‌ సినిమా కాకపోయినా... ‘డిశ్పాచ్‌’తో తొలి చిత్రంలోనే మనోజ్‌బాజ్‌పాయ్‌ లాంటి మంచి నటుడితో కలిసి పని చేయడం నాకు లభించిన అద్భుత అవకాశం.


చెప్పాలంటే భయం...

అసోంలోని ఓ మధ్యతరగతి కుటుంబం మాది. ఊహ తెలిసినప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టం ప్రేమగా మారింది. కొన్నాళ్లకు నటించాలన్న తపన... తెరపై నన్ను నేను చూసుకోవాలన్న కోరిక మొదలైంది. అయితే ఎవరితోనైనా చెబితే ఎక్కడ ఆట పట్టిస్తారోననే భయం. ‘నువ్వేమన్నా అనుష్కాలాగా ఉన్నావా? ప్రియాంకతో సరిపోతావా’ లాంటి వ్యాఖ్యలతో నిరుత్సాహపరుస్తారనే సందేహం. దాంతో చాలా ఏళ్లు నా ఇష్టాన్ని నాలోనే దాచుకున్నా. ఇలా ఎంతోమంది తమను తాము తక్కువ చేసుకొని... కలలను చంపేసుకొంటున్నారు. వారిలా నేనూ మిగిలిపోవాలని అనుకోలేదు.


కాలేజీకి వెళ్లాక...

పాఠశాల విద్యాభ్యాసం పూర్తయింది. కాలేజీలో చేరాను. అప్పుడు నా స్నేహితులకు చెప్పడం మొదలుపెట్టాను... ‘నేను నటిని కావాలని అనుకొంటున్నా’ అని. చాలామంది నేనేదో సరదాగా మాట్లాడుతున్నానని పట్టించుకోలేదు. నవ్వేసి వెళ్లిపోయేవారు. సన్నిహితులు, బంధువులు అయితే ‘సినిమాలంటే కురచ డ్రెస్సులు వేసుకోవాలి. అలాంటివి మన ఇంటికి సరిపడవు’ అనేవారు. వేరొకరైతే ప్రయత్నాలు అప్పటితోనే ఆపేసేవారేమో! కానీ ఆ మాటలు నాలో మరింత పట్టుదలను పెంచాయి. ఎలాగైనా నటిని అయ్యి చూపించాలని నిశ్చయించుకున్నాను. అసోం వదిలి ముంబయికి వచ్చేశాను. నాకు తెలుసు... నేను అనుష్కా అంతటి అందగత్తెను కాదని. అలాగని ప్రయత్నం ఆపదలచుకోలేదు.


తొమ్మిదేళ్ల ప్రయత్నం...

నటి కావాలన్న బలమైన ఆకాంక్ష మినహా పరిశ్రమ గురించి నాకు ఏమీ తెలియదు. ఎవరిని కలవాలనే కనీస అవగాహన లేదు. ఎంతో ప్రయత్నిస్తే ఒక చిన్న అవకాశం వచ్చింది... కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అసిస్టెంట్‌గా. ఎలాగో పరిశ్రమలోకి అడుగు పెట్టాను. ‘బంగిస్తాన్‌, పికు, రయీస్‌’ చిత్రాలకు పని చేశాను. అది నా కెరీర్‌కు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. దాంతో మళ్లీ ఆలోచనలో పడ్డాను. అదే సమయంలో ‘అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ స్కూల్‌’ నిర్వహించిన వర్క్‌షా్‌పకు వెళ్లాను. ఆ తరువాత చాలా వర్క్‌షా్‌పలకు హాజరయ్యాను. ఇవన్నీ నటిగా ఎదగడానికి, నాలో ఆత్మవిశ్వాసం పెంపొందడానికి ఎంతో దోహదపడ్డాయి. ఐదేళ్ల ప్రయత్నం తరువాత 2020లో ఒక సినిమాలో అవకాశం లభించింది. ఆడిషన్స్‌కు వెళితే నిరాశే ఎదురైంది. అయితే మొదట వద్దన్నవారే మళ్లీ రమ్మన్నారు. నాలుగేళ్ల అనంతరం ఆ చిత్రం గత నెల విడుదల అయింది. అదే ‘డిశ్పాచ్‌’. మనోజ్‌బాజ్‌పాయ్‌తో కలిసి పని చేయడంవల్ల నటన పరంగానే కాకుండా చాలా విషయాలు నేర్చుకున్నాను. అంత స్టార్‌ అయినా ఆయనలో ఆ దర్పం కనిపించదు. నాలాంటి జూనియర్లతో కూడా సరదాగా ఉంటారు. అవసరమైనచోట సలహాలు ఇస్తారు. దర్శకుడి పనిని దర్శకుడికే వదిలేస్తారు. పాత్రలోకి ఒదిగిపోయాక దాన్ని పండించడానికి వంద శాతం కష్టపడతారు. అదే ఆయన్ను ప్రత్యేకంగా నిలిపిందని అనుకొంటున్నాను.

నాన్నను చూసి నేర్చుకున్నా...

తెరపై కనిపించాలని వచ్చిన నాకు నటి కావడానికి తొమ్మిదేళ్లు పట్టింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు. అడుగడుగునా సవాళ్లు. కానీ ఏ రోజూ వెనక్కి వెళ్లిపోవాలని అనుకోలేదు. ఈ పట్టుదల, మనం చేసే పనిపై విశ్వాసం మా నాన్నను చూసి నేర్చుకున్నా. ఆయన వ్యాపారవేత్త. బాగా డబ్బు సంపాదించారు. పోగొట్టుకున్నారు. తిరిగి సంపాదించాలని ఇప్పటికీ కష్టపడుతున్నారు. ఈ వయసులోనూ ఆయన పట్టు వదలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది నేనెందుకు చేయలేను? నిజాయతీగా ప్రయత్నిస్తే ఎప్పటికైన సత్ఫలితం వస్తుంది. అలా నాన్నను ప్రేరణగా తీసుకొని అడుగులు వేశాను.’’

Updated Date - Jan 16 , 2025 | 07:56 AM