Share News

కళ్లకు విశ్రాంతి ఇలా...

ABN , Publish Date - Jan 16 , 2025 | 07:38 AM

శీతాకాలంలో వీచే చలిగాలుల వల్ల కళ్లలో తేమ తగ్గిపోతుంటుంది. కళ్లు ఒత్తిడికి గురై పొడిబారుతుంటాయి. దీంతో కళ్లు ఎర్రగా మారి గుచ్చుకుంటున్నట్లుగా అనిపిస్తాయి. కళ్లు త్వరగా అలసిపోతాయి కూడా. వైద్యుల సలహా మేరకు కంటి చుక్కలు వాడడంతోపాటు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.

కళ్లకు విశ్రాంతి ఇలా...

శీతాకాలంలో వీచే చలిగాలుల వల్ల కళ్లలో తేమ తగ్గిపోతుంటుంది. కళ్లు ఒత్తిడికి గురై పొడిబారుతుంటాయి. దీంతో కళ్లు ఎర్రగా మారి గుచ్చుకుంటున్నట్లుగా అనిపిస్తాయి. కళ్లు త్వరగా అలసిపోతాయి కూడా. వైద్యుల సలహా మేరకు కంటి చుక్కలు వాడడంతోపాటు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.

ఏకాగ్రతగా చూడడం

ఇది యోగాభ్యాసంలో ఒక ప్రక్రియ. స్థిరంగా చూపు నిలపడమే దీని ఉద్దేశం. మీ నుంచి మూడు అడుగుల దూరంలో ఒక కొవ్వొత్తిని ఉంచి వెలిగించండి. యథాస్థానంలో నిలబడి కొవ్వొత్తి మంటను అయిదు నుంచి పది నిమిషాలపాటు రెప్పవేయకుండా తదేకంగా చూడండి. ఇలా ప్రతిరోజూ చేస్తూ ఉంటే కళ్లలో నీరు సహజంగా ఉత్పత్తి అవుతుంది. తేమ శాతం పెరిగి కళ్లు పొడిబారే సమస్య తగ్గుతుంది. ఏకాగ్రతతోపాటు కంటి చూపు మెరుగుపడుతుంది.


అరచేతులతో వేడి అద్దడం

ల్యాప్‌టా్‌పలు, కంప్యూటర్ల ముందు పనిచేసేవాళ్లకి; చదువుకునే పిల్లలకు కళ్లు ఒత్తిడికి గురై అలసిపోతూ ఉంటాయి. ఈ సమస్య చలికాలంలో మరింత అధికంగా ఉంటుంది. ఇలాంటపుడు కళ్లకి విశ్రాంతి అవసరం. అరచేతులను ఒకదానిపై మరోదానిని చేర్చి వేగంగా రుద్దాలి. రెండు అరచేతులు వేడిగా అయిన తరవాత వాటిని మూసిన కళ్లమీద అద్దాలి. రెండు నిమిషాలు వేడి తగ్గే వరకు అలాగే ఉంచాలి. గట్టిగా గాలి పీల్చాలి. ఇలా వరుసగా నాలుగుసార్లు చేయాలి. అరచేతుల వేడికి కళ్లలోని కండరాలు సడలి విశ్రాంతి పొందుతాయి. కళ్లకు రక్తప్రసరణ జరిగి అలసట తగ్గుతుంది.


కళ్లు గుండ్రంగా తిప్పడం

కుర్చీలో కూర్చుని వీపుని నిటారుగా ఉంచాలి. కళ్లను గుండ్రంగా సవ్య దిశలో తరవాత అపసవ్య దిశలో తిప్పాలి. ఇలా పది నిమిషాలు చేయాలి. దీనివల్ల కంటి చూట్టూ ఉన్న కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. దృష్టిని కేంద్రీకరించే సామర్థ్యం పెరుగుతుంది. కళ్లలో ఎరుపుదనం తగ్గి ప్రకాశవంతంగా మెరుస్తాయి.


వేగంగా రెప్ప వేయడం

రెప్పవేసే ప్రక్రియ ద్వారానే కళ్లు ద్రవాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. తరచుగా రెప్పవేస్తూ ఉంటేనే కళ్లు తేమగా ఉంటాయి. కంప్యూటర్ల ముందు పనిచేసేవారు, తదేక దృష్టితో చూస్తూ చదివే పిల్లలు చాలా సమయం వరకూ రెప్ప వేయరు. దీనికి చలిగాలులు తోడైతే కళ్లలో తేమశాతం పూర్తిగా తగ్గుతుంది. అందుకే వీలుదొరికినపుడల్లా కనీసం ఇరవై సెకన్ల పాటు వేగంగా కళ్లు ఆర్పుతూ ఉండాలి. తరవాత అర నిమిషం కళ్లు మూసుకుని ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే కళ్లు పొడిబారే సమస్య తలెత్తదు.


నీళ్లు చిలకరించడం

ఇది కళ్లను శుభ్రం చేసేందుకు ఉపయోగించే ప్రక్రియ. దోసిలి నిండా నీళ్లను తీసుకుని ముఖానికి దగ్గరగా పెట్టుకుని మెల్లగా కళ్లమీదికి చల్లాలి. గోరువెచ్చని లేదంటే చల్లని నీళ్లను ఇలా చిలకరించుకోవచ్చు. దీనివల్ల కళ్లలోని దుమ్ము, ధూళి తొలగిపోతాయి. ఎండ, గాలి వల్ల కలిగే ఒత్తిడి, అలసట తగ్గి కళ్లు ప్రశాంతంగా కనిపిస్తాయి. త్రిఫల చూర్ణం కలిపి వడకట్టిన నీళ్లు లేదా గులాబీ నీళ్లను చిలకరించుకున్నా కూడా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

Updated Date - Jan 16 , 2025 | 07:38 AM