Internet Speed In Smart Phone : ఫోన్లో ఇంటర్నెట్ స్లోగా ఉందా..ఇలా చేస్తే నిమిషాల్లోనే జెట్ స్పీడ్‌తో వస్తుంది..
ABN , Publish Date - Feb 02 , 2025 | 08:49 PM
మీ ఫోన్లో ఇంటర్నెట్ స్లోగా ఉందా.. కొత్త ఫోన్ అయినా డేటా వేగంగా రావడం లేదా.. ఈ టిప్స్ పాటిస్తే నిమిషాల్లోనే ఇంటర్నెట్ జెట్ స్పీడ్‌తో వస్తుంది..

అర్జెంట్‌గా ఫొటో లేదా ఫైల్ పంపించాల్సి ఉంటుంది. త్వరగా పని పూర్తికాదు. ఫుల్ క్లారిటీతో ఫోన్‌లోని ఓటీటీ యాప్‌లో మూవీ చూడాలి అనుకుంటాం. ఎంతసేపైనా బ్రౌజింగ్ అవుతూనే ఉంటుంది. ఆన్‌లైన్ గేమింగ్, స్ట్రీమింగ్, సోషల్ మీడియా, డౌన్లోడ్ కోసం ఇలా దేనికైనా ఇంటర్నెట్ యాక్సెస్ సజావుగా ఉంటేనే వేగంగా అనుకున్నది చేయగలం. మీ స్మార్ట్ ఫోన్ కొత్తదే కావచ్చు. వేలు పోసి కొన్న బెస్ట్ బ్రాండెడ్ ఫోన్ అయ్యుండచ్చు. అయినా, నత్త నడకతో ఇంటర్నెట్ వస్తూ ఉంటుంటే కచ్చితంగా చిరాకేస్తుంది. అందుకని వేగంగా డేటా స్పీడ్ పెరిగేందుకు ఏం చేయాలా అని బుర్ర చించుకోకండి. కంగారు పడకుండా ఈ సులభమైన టిప్స్ అనుసరించండి. నిమిషాల్లోనే మీ స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ డేటా వేగం పుంజుకోవడం ఖాయం..
మీ మొబైల్‌లో ఇంటర్నెట్ స్పీడ్ నెమ్మదిగా ఉండటానికి కారణాలు :
నెట్‌వర్క్ సంబంధిత సమస్యలు : సెల్ టవర్‌కు దూరంగా ఉన్నా, బలహీనమైన నెట్‌వర్క్ కవరేజీ ఉన్న ప్రాంతంలో లేదా ఒకే నెట్‌వర్క్‌ని ఎక్కువ మంది ఉపయోగిస్తుంటే ఇంటర్నెట్ వేగం నెమ్మదించవచ్చు.
ఫోన్ : తగినంత ర్యామ్ లేని సందర్భంలో లేదా మాల్వేర్ లేదా వైరస్ దాడి చేసినప్పుడు డేటా స్పీడ్ తగ్గుతుంది. ఒకవేళ మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ పాతది అయితే వెంటనే తాజా సాఫ్ట్‌వేర్‌కి అప్‌డేట్ చేయండి.
డేటా సంబంధిత సమస్యలు : మీ డేటా పరిమితిని మించినా, కొన్ని మొబైల్ క్యారియర్‌లు నిర్దిష్ట మొత్తంలో డేటాను ఉపయోగించిన తర్వాత లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్‌లు మీ ఇంటర్నెట్ స్పీడ్‌ను నెమ్మదింపజేస్తూ డేటాను వినియోగించుకోవచ్చు.
అవరోధాలు : గోడలు, భవనాలు లేదా కొండలు వంటి భౌతిక అడ్డంకులు నెట్‌వర్క్ సిగ్నల్‌ను నిరోధించవచ్చు లేదా బలహీనపరిచేలా చేయవచ్చు. భారీ వర్షం లేదా పొగమంచు వంటి ప్రతికూల వాతావరణం నెట్‌వర్క్ సిగ్నల్ బలాన్ని ప్రభావితం చేస్తుంది.
ఇతర సమస్యలు : సర్వర్ సమస్యలు, యాప్ సమస్యలు, రూటర్ సమస్యలు నెమ్మదిగా ఇంటర్నెట్ వేగాన్ని కలిగిస్తాయి.
ఇంటర్నెట్ స్పీడ్ పెరిగేందుకు చిట్కాలు..
కొన్నిసార్లు ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్‌లు ఎక్కువ డేటాను వినియోగించుకోవడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. అందువల్ల, ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి యాప్‌ల జాబితాను చూడండి. మీరు ఉపయోగించని యాప్‌లను మూసివేయండి. మీరు నెట్‌వర్క్ సెట్టింగ్‌లను కూడా రీసెట్ చేయవచ్చు. ఇది నెట్‌వర్క్ కనెక్షన్‌ని రిఫ్రెష్ చేస్తుంది. తద్వారా ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది.